Ravichandran Ashwin: వేరే లెవల్‌ ఆల్‌రౌండర్‌.. అశూ ఈజ్‌ ద బెస్ట్‌! ఎందుకంటే!

17 Sep, 2022 15:19 IST|Sakshi

Ravichandran Ashwin Birthday- Virat Kohli- Dinesh Karthik Wishes: టీమిండియా ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ పుట్టిన రోజు నేడు. నేటితో (సెప్టెంబరు 17) అతడు 36వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా సహచర ఆటగాళ్లు, అభిమానుల నుంచి అశూకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

వేరే లెవల్‌ ఆల్‌రౌండర్‌
అశ్విన్‌ కెరీర్‌కు సంబంధించిన గణాంకాలు.. మేజర్‌ టోర్నీలో అతడు భాగమైన తీరును ప్రస్తావిస్తూ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి అతడిని విష్‌ చేసింది. ఇక టీమిండియా వెటరన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌.. తనదైన శైలిలో అశూకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

‘‘వేరే లెవల్‌ ఆల్‌రౌండర్‌.. మా అశ్విన్‌కు హ్యాపియెస్ట్‌ బర్త్‌డే. బర్త్‌డే బాయ్‌ మమ్మల్ని ట్రిప్‌నకు తీసుకువెళ్తున్నాడు’’ అంటూ అశ్విన్‌తో దిగిన ఫొటోను పంచుకున్నాడు డీకే.

ఇక భారత జట్టు మాజీ కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి సైతం అశ్విన్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘‘హ్యాపీ బర్త్‌డే అశ్‌. నువ్వు కలకాలం సంతోషంగా.. ఆరోగ్యంగా ఉండాలి’’ అని ఆకాంక్షించాడు. 

అశూ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?!
టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సెప్టెంబరు 17, 1986లో తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. చిన్ననాటి నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న అశ్విన్‌.. ఓపెనింగ్‌ బ్యాటర్‌గా.. మీడియమ్‌ పేస్‌ బౌలర్‌గా తన కెరీర్‌ ఆరంభించాడు.

అయితే, కోచ్‌ సీకే విజయ్‌ సలహాతో ఆఫ్‌ స్పిన్నర్‌గా ఎదిగిన అశ్విన్‌.. టీమిండియా లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్‌గానూ జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు.

2010లో జింబాబ్వేతో టీ20 మ్యాచ్‌తో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు అశ్విన్‌. అదే విధంగా.. వెస్టిండీస్‌తో అరంగేట్ర టెస్టులోనే తొమ్మిది వికెట్లు పడగొట్టి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. 

ఒకే మ్యాచ్‌లో సెంచరీ, ఐదు వికెట్ల ఘనత
2011లో వెస్టిండీస్‌తో టెస్టు మ్యాచ్‌ సందర్భంగా ఐదు వికెట్లు తీయడంతో పాటు సెంచరీ కూడా సాధించాడు అశ్విన్‌. నాటి మూడో టెస్టులో 156 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీయడంతో పాటుగా.. 103 పరుగులు సాధించాడు.

ముత్తయ్య మురళీధరన్‌తో పాటుగా
66 టెస్టుల్లో 350 వికెట్లు తీసిన అశ్విన్‌.. శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌తో పాటుగా.. అత్యంత వేగంగా టెస్టుల్లో ఈ ఘనత సాధించిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు.

టీ20లలోనూ అరుదైన ఘనత
టీమిండియా తరఫున టీ20లలో 50 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా అశ్విన్‌ నిలిచాడు. ఇక ప్రస్తుతం అతడు టీ20 ప్రపంచకప్‌-2022కు సన్నద్ధమయ్యే పనిలో ఉన్నాడు.

659 వికెట్లు.. పరుగులు ఎన్నంటే
టీమిండియా తరఫున ఇప్పటి వరకు 255 మ్యాచ్‌లు ఆడిన రవిచంద్రన్‌ అశ్విన్‌.. మొత్తంగా 659 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 3799 పరుగులు సాధించాడు. అందుకే మరి డీకే.. అశూను వేరే లెవల్‌ ఆల్‌రౌండర్‌ అన్నది! 

ఇక టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా అశ్విన్‌ కొనసాగుతున్నాడు. 2011 ఐసీసీ వరల్డ్‌కప్‌, 2013 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన భారత జట్టులో అశ్విన్‌ సభ్యుడు.

ముచ్చటైన కుటుంబం 
2011లో ప్రీతి నారాయణ్‌ను వివాహమాడాడు అశ్విన్‌. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు ఆద్య అశ్విన్‌, అఖీరా అశ్విన్‌.

చదవండి: అతడు జట్టులో లేకపోవడం టీమిండియాకు తీరని లోటు: శ్రీలంక మాజీ కెప్టెన్‌
మిర్కాతో అలా ప్రేమలో పడ్డ ఫెదరర్‌! ఫెడ్డీలో మనకు తెలియని కోణం!

మరిన్ని వార్తలు