ఆర్‌సీబీ ప్లేయర్‌ విధ్వంసం.. 

1 Apr, 2021 21:19 IST|Sakshi

అక్లాండ్: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఆఖరి టీ20లో న్యూజిలాండ్ యువ క్రికెటర్ ఫిన్ అలెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కెరీర్‌లో మూడో టీ20 ఆడుతున్న అలెన్‌.. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అలెన్(29 బంతుల్లో 71; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసంతో న్యూజిలాండ్ 65 పరుగుల తేడాతో బంగ్లా చిత్తు చేసి, 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఫిన్ అలెన్.. ఈ ఏడాది ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దీంతో అలెన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ చూసిన ఆర్‌సీబీ అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కాగా, ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ జోష్‌ ఫిలిప్‌ వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2021 నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో ఫిన్ అలెన్‌ను ఆర్‌సీబీ కనీస ధరకు(రూ.20 లక్షలు) దక్కించుకుంది. 

వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌ను 10 ఓవర్లకు కుదించగా.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. ఫిన్ అలెన్‌కు అండగా మార్టిన్ గప్తిల్(19 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స్‌లతో 44) చెలరేగి ఆడాడు. అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన బంగ్లా జట్టు.. 9.3 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో మహమ్మద్ నైమ్(19), సౌమ్య సర్కార్( 10), మోసెద్దెక్ హుసేన్(13) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో టాడ్‌ ఆస్టల్‌ 4, సౌథీ 3 వికెట్లు పడగొట్టారు. ఇదిలా ఉండగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సైతం న్యూజిలాండ్‌ 3-0తో వైట్‌వాష్‌ చేసింది.
చదవండి: ఆనంద్‌ మహీంద్రాకు నట్టూ రిటర్న్‌ గిఫ్ట్‌..

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు