IND Vs AUS: సిక్స్‌తో మ్యాచ్‌ ఫినిష్‌.. అయినా రింకూ సిక్సర్‌ ఎందుకు కౌంట్‌ కాలేదు..?

24 Nov, 2023 19:06 IST|Sakshi

ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. విశాఖపట్నం వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి టీ20లో రికార్డు విజయం సాధించిన భారత జట్టు.. వరల్డ్‌కప్‌ ఫైనల్‌ల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.

ఆస్ట్రేలియా బ్యాటర్లల్లో జోష్‌ ఇంగ్లీష్‌ మెరుపు సెంచరీ (50 బంతుల్లో 110)తో చెలరేగాడు. అనంతరం 209 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(80), ఇషాన్‌ కిషన్‌(58), రింకూ సింగ్(22)‌ అద్బుత ఇన్నింగ్స్‌లతో భారత్‌ 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 

అయితే ఈ మ్యాచ్‌లో భారత విజయం సాధించినప్పటికీ ఆఖరి ఓవర్‌లో కాస్త గందరగోళం నెలకొంది. సీన్‌ అబాట్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో భారత విజయానికి కేవలం 7 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. ఈ క్రమంలో స్ట్రైక్‌లో ఉన్న రింకూ తొలి బంతినే బౌండరీగా మలిచాడు. దీంతో భారత విజయ సమీకరణం.. 5 బంతుల్లో 3 పరుగులుగా మారింది. అనంతరం రెండో బంతికి బైస్‌ రూపంలో ఒక పరుగు వచ్చింది. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్‌ చోటుచేసుకుంది. 

తర్వాత మూడు బంతుల్లో వరుసగగా ముగ్గురు బ్యాటర్లు ఔటయ్యారు. అక్షర్‌ పటేల్‌ క్యాచ్‌ ఔట్‌ కాగా.. బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ రింకూకు స్ట్రైక్‌ ఇచ్చే క్రమంలో రనౌటయ్యారు. దీంతో ఆఖరి బంతికి భారత విజయాన్ని ఒక్క పరుగు అవసరమ్వగా.. రింకూ సింగ్‌ సిక్స్‌ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే రింకూ ఆఖరి బంతికి కొట్టిన సిక్సర్‌ కౌంట్‌ కాలేదు. భారత్‌ విజయం సాధించినప్పటికీ.. అతడి వ్యక్తిగత స్కోర్‌లో కూడా ఆ సిక్సర్‌ జమ కాలేదు.

రింకూ సిక్సర్‌ ఎందుకు కౌంట్‌ కాలేదు..?
అయితే ఐసీసీ మెన్స్‌ టీ20 నిబంధనల ప్రకారం.. 16.1, 16.2 లేదంటే 16.3.1 క్లాజుల ప్రకారం.. మ్యాచ్‌ ముగిసే సమయంలో.. ఫలితం తేలుతున్న క్రమంలో తర్వాత ఏం జరిగిందన్న విషయంతో సంబంధం ఉండదు. అయితే, ఐసీసీ నిబంధనల్లో ఉన్న మరో క్లాజు 41.17.2(పెనాల్టీ పరుగులు) విషయంలో మాత్రం ఇందుకు మినహాయింపు ఉంటుంది.

ఇక్కడ టీమిండియా- ఆస్ట్రేలియా మ్యాచ్‌లో రింకూ సిక్సర్‌ కొట్టగానే భారత డగౌట్‌ సంబరాల్లో మునిగి తేలిపోయింది. కానీ చివరి బంతి వేసే క్రమంలో ఆసీస్‌ పేసర్‌ అబాట్‌ ఓవర్‌ స్టెప్‌ చేశాడు. దీంతో థర్డ్‌ అంపైర్‌ కాస్త లేట్‌గా నో బాల్‌గా ప్రకటించాడు. అయితే ఐసీసీ రూల్స్‌ ప్రకారం.. అంటే మ్యాచ్‌ ముగింపు దశకు చేరుకున్న తర్వాత.. ఫలితం ఖరారైన సందర్భంలో వచ్చే పరుగులను పరిగణనలోకి తీసుకోరు.

అంటే ఛేజింగ్‌లో ఏ జట్టు విజయానికైనా కేవలం ఒక్క పరుగు మాత్రమే అవసరమైనప్పుడు.. బ్యాటర్‌ సిక్స్‌ కొట్టినా ఎక్స్‌ట్రాస్‌ రూపంలో వచ్చే రన్‌ను మాత్రమే లెక్కలోకి తీసుకుంటారని చెప్పవచ్చు. ఉదాహరణకు జట్టు గెలుపుకు ఒక్క పరుగు అవసరమైనప్పుడు.. బౌలర్‌ నో బాల్‌గా సంధించిన బంతిని బ్యాటర్‌ బౌండరీ గానీ రన్స్‌ తీసినా కౌంట్‌ చేయరు. ఎందుకంటే.. నోబాల్‌ రూపంలో వచ్చే పరుగుతో మ్యాచ్‌ ఫలితం తేలిపోతుంది. రింకూ సింగ్‌ సిక్స్‌ విషయంలో ఇదే జరిగింది. అదే భారత్ విజయానికి ఒకటి కంటే ఎక్కువ పరుగులు అవసరమైతే.. రింకూ సింగ్ కొట్టిన సిక్స్‌ను పరిగణనలోకి తీసుకునేవారు.
చదవండి: IPL 2024: చెన్నై సూపర్‌ కింగ్స్‌లోకి ఆసీస్‌ విధ్వంసకర ఆటగాడు..!?

మరిన్ని వార్తలు