PAK vs AUS: పాపం బాబర్‌.. పాకిస్తాన్‌కు ఇదేమి కొత్త కాదు! ఆస్ట్రేలియాలో వారికి చుక్కలే

24 Nov, 2023 16:56 IST|Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో పేలవ ప్రదర్శన కారణంగా పాకిస్తాన్‌ కెప్టెన్సీ నుంచి బాబర్‌ ఆజం తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు తమ టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌గా వెటరన్‌ షాన్‌ మసూద్‌ను ఎంపిక చేయగా.. టీ20 కెప్టెన్‌గా షాహీన్‌ షా అఫ్రిదిని నియమించింది. ఇంకా తమ వన్డే సారథిని మాత్రం పీసీబీ ఎంపిక చేయలేదు. ఇక వన్డే ప్రపంచకప్‌-2023 అనంతరం పాకిస్తాన్‌ తొలి ద్వైపాక్షిక సిరీస్‌కు సిద్దమవుతోంది.

షాన్‌ మసూద్‌ సారథ్యంలోని పాక్‌ జట్టు మూడు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్‌ 14న పెర్త్‌ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ రెడ్‌బాల్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ కోసం పాకిస్తాన్‌ జట్టు ఇప్పటినుంచే తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ జట్టును ఉద్దేశించి ఆస్ట్రేలియా లెజెండ్‌ ఇయాన్‌ చాపెల్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌లను మార్చడం పాకిస్తాన్‌కు ఇదేమి కొత్తకాదని చాపెల్‌ విమర్శించాడు. 

"పాపం బాబర్‌. అతడు అద్భుతమైన ఆటగాడు. పాకిస్తాన్‌ కెప్టెన్సీ నుంచి బాబర్‌ తనంతట తను తప్పుకోలేదు. అతడి కంటే బెటర్‌ కెప్టెన్‌ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుకు దొరికి ఉంటాడు. అందుకే అతడిని తప్పించారు. కెప్టెన్లను తరుచుగా మార్చడం పాకిస్తాన్‌కు అలవాటే అని ఓ స్పోర్ట్స్‌ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాపెల్‌ పేర్కొన్నాడు.

అదే విధంగా ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ గురించి మాట్లాడుతూ.. పాకిస్తాన్‌కు జట్టుకు ఆస్ట్రేలియాలో మంచి రికార్డు లేదు. పాకిస్తాన్‌ అత్యుత్తమ జట్టు అయినప్పటికీ ఆస్ట్రేలియా పిచ్‌లపై ఇప్పటివరకు బ్యాటింగ్‌, బౌలింగ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచలేకపోయారు. ఆస్ట్రేలియా వంటి బౌన్సీ పిచ్‌లపై ఆడటానికి చాలా కష్టపడతారు. పాకిస్తాన్‌ జట్టు కంటే ఆస్ట్రేలియా అన్ని విధాల బలంగా ఉంది. వార్నర్‌, హెడ్‌ వంటి బ్యాటింగ్‌ ఎటాక్‌.. స్టార్క్‌, కమ్మిన్స్‌, హాజిల్‌ వుడ్‌ వంటి వరల్డ్‌క్లాస్‌ పేసర్లు ఉన్నారని  చాపెల్‌ చెప్పుకొచ్చాడు.
చదవండి:రోహిత్‌ అలా.. కోహ్లి ఇలా.. ఎవరు మాత్రం టెంప్ట్‌ కాకుండా ఉంటారు?: ఆశిష్‌ నెహ్రా

మరిన్ని వార్తలు