ఇంకా ఆశతోనే ఉన్నా: ఊతప్ప

24 Aug, 2020 14:56 IST|Sakshi

దుబాయ్‌: త్వరలో యూఏఈ వేదికగా జరగబోయే ఐపీఎల్‌-13వ సీజన్‌లో సత్తాచాటి భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని వెటరన్‌ ఆటగాడు రాబిన్‌ ఊతప్ప చూస్తున్నాడు. ఈ ఏడాది రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున ఆడబోతున్న ఊతప్ప.. తన అంతర్జాతీయ పునరామనంపై ఎన్నో ఆశలతో ఉన్నాడు. ఈ మేరకు ఐపీఎల్‌ను సన్నాహకంగా ఉపయోగించుకోవాలన్నాడు. ఈ సీజన్‌ ఐపీఎల్‌ తన కెరీర్‌కు కీలక మలుపు కాబోతుందని ఊతప్ప ఆశిస్తున్నాడు.  రాజస్తాన్‌ రాయల్స్‌ ట్వీటర్‌ వేదికగా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఊతప్ప తన మనసులోని మాటను వెల్లడించాడు. ‘ ఒక చక్కటి ఐపీఎల్‌ సీజన్‌ నిన్ను తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టేలా చేస్తుందని నమ్ముతున్నావా?’ అని అడగ్గా, దానికి అవుననే సమాధానం ఇచ్చాడు రాబిన్‌.(చదవండి: ‘తప్పు చేశాం.. వరల్డ్‌కప్‌ చేజార్చుకున్నాం’)

‘ ఇంకా ఆ డ్రీమ్‌ సజీవంగానే ఉంది’ అని పేర్కొన్నాడు. 2015లో భారత్‌ తరఫున చివరిసారి ఆడిన ఊతప్ప.. 46 వన్డేలు, 13 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 25.94 యావరేజ్‌తో 934 పరుగులు  చేయగా, అంతర్జాతీయ టీ20ల్లో 249 పరుగులు చేశాడు. 2007లో భారత్‌ జట్టు గెలిచిన టీ20 వరల్డ్‌కప్‌లో ఊతప్ప సభ్యుడు. ఇక ఐపీఎల్‌ కెరీర్‌ విషయానికొస్తే 177 మ్యాచ్‌లు ఆడి 4,411 పరుగులు చేశాడు. ఇక్కడ యావరేజ్‌ 28.83 ఉండగా, స్టైక్‌రేట్‌ 130.5గా ఉంది. కాగా, కోల్‌కతా గెలిచిన రెండు ఐపీఎల్‌ టైటిల్స్‌లో ఊతప్ప భాగమయ్యాడు. గతేడాది ఊతప్పను కేకేఆర్‌ వదులుకోవడంతో అతన్ని రాజస్తాన్‌ రాయల్స్‌ కొనుగోలు చేసింది. (చదవండి: సురేశ్‌ రైనా.. దుబాయ్‌ లైఫ్‌)

మరిన్ని వార్తలు