యూఎస్‌ ఓపెన్‌ ఆడతా: బోపన్న

15 Aug, 2020 02:28 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐదు నెలల విరామం తర్వాత మళ్లీ కోర్టులో అడుగుపెట్టేందుకు భారత డబుల్స్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ రోహన్‌ బోపన్న సిద్ధమవుతున్నాడు. తన భాగస్వామి డెనిస్‌ షపోవలోవ్‌ (కెనడా)తో కలిసి యూఎస్‌ ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్‌ బరిలో దిగుతానని పేర్కొన్నాడు. ఈ మేరకు ప్రొఫెషనల్‌ సర్క్యూట్‌లో సత్తా చాటేందుకు తనను తాను సన్నద్ధం చేసుకుంటున్నానని బోపన్న చెప్పాడు. ‘డెనిస్‌ యూఎస్‌లోని ఐఎంజీ అకాడమీలోనే ఉన్నాడు. యూఎస్‌ ఓపెన్‌ కన్నా ముందు న్యూయార్క్‌లో సిన్సినాటి ఓపెన్‌ ఆడాలని మేం నిర్ణయించుకున్నాం.

ఆ తర్వాత రోమ్‌ ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీల్లోనూ పాల్గొంటాం’ అని ప్రపంచ 37వ ర్యాంకర్‌ బోపన్న పేర్కొన్నాడు. యూఎస్‌ వెళ్లేందుకు కోవిడ్‌–19 పరీక్ష కూడా చేయించుకోనున్నాడు. అనూహ్యంగా దొరికిన ఈ విరామ సమయంలో ఎన్నాళ్లుగానో నేర్చుకోవాలనుకున్న ‘అయ్యంగార్‌ యోగా’ను ప్రాక్టీస్‌ చేసినట్లు బోపన్న పేర్కొన్నాడు. దీనిద్వారా తన శరీరం దృఢంగా మారిందని, తన కాళ్లు బలంగా మారడం వల్ల ఆటాడే సమయంలో మోకాళ్లపై ఎక్కువగా భారం పడబోదని పేర్కొన్నాడు.  బెంగళూరు స్పోర్ట్స్‌ స్కూల్‌ విద్యార్థులకు 24 నెలల పాటు స్కాలర్‌షిప్‌ అందించే ప్రక్రియ మొదలుపెట్టామని అతను వెల్లడించాడు.

మరిన్ని వార్తలు