IPL 2024-Mohammed Shami: గుజరాత్‌ టైటాన్స్‌కు షమీ గుడ్‌బై..?

8 Dec, 2023 12:55 IST|Sakshi

ఐపీఎల్‌ 2024 వేలానికి ముందు మాజీ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ వరుస చేదు వార్తలు వినాల్సి వస్తుంది. ఇప్పటికే హార్దిక్‌ పాండ్యాను (మాజీ కెప్టెన్‌) ట్రేడింగ్‌ విధానం వల్ల ముంబై ఇండియన్స్‌కు కోల్పోయిన ఆ ఫ్రాంచైజీ.. స్టార్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీని సైతం మిస్‌ చేసుకునేలా ఉంది. ట్రేడింగ్‌ ద్వారా షమీకి బదిలీ చేసుకునేందుకు ఓ దక్షిణాది ఫ్రాంచైజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

షమీ సైతం వారి ఆఫర్‌ పట్ల సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. టైటాన్స్‌ సీఓఓ కల్నల్‌ అర్విందర్‌ సింగ్‌ బహిరంగ ప్రకటన చేయడంతో షమీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పేరును ప్రస్తావించకుండా ఓ ఫ్రాంచైజీ షమీతో సంప్రదింపులు జరిపిందని అర్విందర్‌ వెల్లడించాడు. సదరు ఫ్రాంచైజీపై అతను మండిపడ్డాడు. ఓ జట్టులోని ఆటగాడిని ఇతర జట్ల యాజమాన్యాలు సంప్రదించకుండా చర్యలు తీసుకోవాలని ఐపీఎల్‌ గవర్నింగ్‌ బాడీని కోరాడు.

అసలు ఐపీఎల్‌లో ట్రేడింగ్‌ విధానమనేదే కరెక్ట్‌ కాదని అభిప్రాయపడ్డాడు. ఇదో అన్యాయమైన ప్రొసీజర్‌ అని ధ్వజమెత్తాడు. ఈనెల 12 వరకు ట్రేడింగ్‌ విండో తెరిచే ఉండనుండటంతో షమీ ఏ నిర్ణయం తీసుకుంటాడోనని అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ట్రేడింగ్‌ డెడ్‌లైన్‌ ముగిసే లోపు షమీతో పాటు మరో ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లు కూడా ఫ్రాంచైజీలు ఛేంజ్‌ కావచ్చని బీసీసీఐ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

కాగా, ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్‌లో షమీ అదరగొట్టిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్‌ అంతకుముందు ప్రదర్శనల నేపథ్యంలో షమీపై ఒక్కసారిగా ఓవర్‌ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఈ సమయంలో షమీ కోసం​ ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు అడ్డదారిలో (ట్రేడింగ్‌) వెళ్లడం తప్పేమీ కాదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వరల్డ్‌కప్‌ ప్రదర్శనల కారణంగా షమీ ప్లేయర్‌ ఆఫ్‌ది మంత్‌ (నవంబర్‌) అవార్డుకు కూడా నామినేట్‌ అయ్యాడు. 
 

>
మరిన్ని వార్తలు