Ruturaj Gaikwad: కోవిడ్‌ నుంచి కోలుకున్న రుతురాజ్‌.. అయినప్పటికి నిరాశే

10 Feb, 2022 19:44 IST|Sakshi

టీమిండియా యువ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌ను దురదృష్టం వెంటాడుతూనే ఉంది. గతేడాది జూలై 2021లో శ్రీలంకతో టి20 సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన రుతురాజ్‌ రెండు టి20 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. టి20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌లో జట్టులో ఎంపికైనప్పటికి బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఎంపికైనప్పటికి అక్కడా అదే పరిస్థితి. ప్రొటీస్‌ గడ్డపై ఒక్క మ్యాచ్‌ ఆడకుండానే రుతురాజ్‌ స్వదేశానికి వచ్చాడు. 

ఇక ఈసారి వెస్టిండీస్‌తో స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్‌కు జట్టులో ఎంపికయిన రుతురాజ్‌ కచ్చితంగా ఎంట్రీ ఇస్తాడని భావించారు. కానీ కరోనా రూపంలో రుతురాజ్‌ను మరోసారి దురదృష్టం వెంటాడింది. తొలి వన్డే ప్రారంభానికి ముందు శిఖర్‌ ధావన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌లతో పాటు రుతురాజ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్నప్పటికి మూడో వన్డేలో రుతురాజ్‌కు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కోవిడ్‌ నుంచి కోలుకున్న శిఖర్‌ ధావన్‌ తనతో పాటు ఓపెనింగ్‌ చేస్తాడని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇప్పటికే పేర్కొన్నాడు. దీంతో రెండో వన్డేలో ఓపెనర్‌గా వచ్చిన పంత్‌ తిరిగి ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంటుంది.

జట్టులో మార్పులు ఉంటాయని రోహిత్‌ చెప్పినప్పటికి.. ఒకటి, రెండు తప్ప పెద్దగా ఏం ఉండకపోవచ్చు. ఈ లెక్కన రుతురాజ్‌కు అవకాశం లేనట్లే. అయితే ఆ తర్వాత జరగనున్న టి20 సిరీస్‌కు రుతురాజ్‌ను ఎంపిక చేయలేదు. దీంతో వన్డే సిరీస్‌ ముగిసిన వెంటనే రుతురాజ్‌ రంజీ ట్రోఫీలో ఆడనున్నాడు. ఇక గతేడాది జరిగిన ఐపీఎల్‌ సీజన్‌లో సీఎస్‌కే తరపున 600లకు పైగా పరుగులు చేసిన రుతురాజ్‌ ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌గా నిలిచాడు. ఆ తర్వాత దేశవాలీ టోర్నీలైన ముస్తాక్‌ అలీ టి20, విజయ్‌ హజారే ట్రోఫీలోనూ రుతురాజ్‌ అదరగొట్టాడు. ముఖ్యంగా విజయ్‌ హజారే ట్రోపీలో రుతురాజ్‌ వరుసగా 4 సెంచరీలు బాది సీజన్‌లో అత్యధిక  పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రుతురాజ్‌ స్థానం సంపాదించాడు. 

మరిన్ని వార్తలు