సాయి సుదర్శన్‌ అజేయ సెంచరీ

20 Jul, 2023 03:08 IST|Sakshi

పాకిస్తాన్‌ ‘ఎ’పై ఎనిమిది వికెట్లతో భారత్‌ ‘ఎ’ ఘనవిజయం

ఎమర్జింగ్‌ కప్‌ టోర్నీలో గ్రూప్‌ ‘టాపర్‌’గా టీమిండియా  

కొలంబో: ఎమర్జింగ్‌ కప్‌ ఆసియా అండర్‌–23 క్రికెట్‌ టోర్నీ లీగ్‌ దశలో భారత్‌ ‘ఎ’ జట్టు అజేయంగా నిలిచింది. పాకిస్తాన్‌ ‘ఎ’తో బుధవారం జరిగిన గ్రూప్‌ ‘బి’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ ‘ఎ’ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్‌ ‘ఎ’ 48 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. ఖాసిమ్‌ అక్రమ్‌ (48; 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

భారత బౌలర్లలో రాజ్‌వర్ధన్‌ హంగార్గేకర్‌ 42 పరుగులిచ్చి 5 వికెట్లు, మానవ్‌ సుథర్‌ 36 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత ‘ఎ’ జట్టు 36.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ (110 బంతుల్లో 104 నాటౌట్‌; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) పాక్‌ బౌలర్ల భరతంపట్టి అజేయ సెంచరీ చేశాడు.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సాయి సుదర్శన్‌ తొలి వికెట్‌కు అభిõÙక్‌ శర్మ (20; 4 ఫోర్లు)తో 58 పరుగులు... రెండో వికెట్‌కు నికిన్‌ జోస్‌ (64 బంతుల్లో 53; 7 ఫోర్లు)తో 99 పరుగులు... మూడో వికెట్‌కు కెపె్టన్‌ యశ్‌ ధుల్‌ (21 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌)తో 53 పరుగులు జోడించాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన టీమిండియా ఆరు పాయింట్లతో గ్రూప్‌ ‘బి’లో అగ్రస్థానం పొందింది.

నాలుగు పాయింట్లతో పాకిస్తాన్‌ రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్లు ఇప్పటికే సెమీఫైనల్‌ చేరాయి. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో శ్రీలంక ‘ఎ’తో పాకిస్తాన్‌ ‘ఎ’; బంగ్లాదేశ్‌ ‘ఎ’తో భారత్‌ ‘ఎ’ తలపడతాయి. ఫైనల్‌ 23న జరుగుతుంది.   

మరిన్ని వార్తలు