పాక్‌ సెలక్టర్‌గా ‘మ్యాచ్‌ ఫిక్సర్‌’ 

2 Dec, 2023 00:33 IST|Sakshi

ఫిక్సింగ్‌ ఉదంతంలో నిషేధానికి గురి కావడంతో పాటు జైలు శిక్ష కూడా అనుభవించిన మాజీ ఆటగాడు సల్మాన్‌ బట్‌ను పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) జాతీయ జట్టు సెలక్టర్‌గా ఎంపిక చేసింది. అతనితో పాటు మరో ఇద్దరు మాజీలు కమ్రాన్‌ అక్మల్, ఇఫ్తికార్‌ అంజుమ్‌ కూడా సెలక్టర్లుగా ఎంపికయ్యారు. చీఫ్‌ కోచ్‌ వహాబ్‌ రియాజ్‌తో కలిసి వీరిద్దరు పని చేస్తారు. సల్మాన్‌ బట్‌ పాక్‌ తరఫున 33 టెస్టులు, 78 వన్డేలు, 24 టి20 మ్యాచ్‌లు ఆడాడు.

2010లో ఇంగ్లండ్‌తో జరిగిన లార్డ్స్‌ టెస్టులో కెప్టెన్‌గా ఉన్న బట్‌ సహచరులు ఆసిఫ్, ఆమిర్‌లతో నోబాల్స్‌ వేయించి స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. ఐసీసీ నిషేధంతో పాటు బట్‌కు 30 నెలల జైలు శిక్ష కూడా పడింది. అయితే 7 నెలలకే విడుదలైన బట్‌ 2016లో తిరిగి క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. దేశవాళీలో మంచి ప్రదర్శన కనబర్చినా...పాక్‌ జట్టు కోసం అతని పేరును మళ్లీ పరిశీలించలేదు. అయితే ఇప్పుడు సెలక్టర్‌గా అతను అధికారిక పదవిలోకి వచ్చాడు.   
 

మరిన్ని వార్తలు