ODI World Cup 2023: స్నేహాలు, పర్సనల్‌ రిలేషన్‌షిప్స్‌.. అందుకే జట్టుకు ఈ దుస్థితి! అప్పుడు నన్నైతే..

26 Oct, 2023 15:35 IST|Sakshi
పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం (PC: ICC)

‘‘జట్టును ప్రకటించినప్పుడే నాకంతా అర్థమైపోయింది. స్నేహాలు, వ్యక్తిగత బాంధవ్యాల ఆధారంగానే ఈ సెలక్షన్‌ జరిగింది. జట్టు సమతూకంగా లేదు. ఇండియాలో వరల్డ్‌కప్‌ టోర్నీలో పాకిస్తాన్‌కు ఈ తిప్పలు తప్పవని నేను ముందే ఊహించాను.

వాళ్లు(మేనేజ్‌మెంట్‌) అన్నీ మాట్లాడతారు గానీ సరైన వ్యూహాలు రచించలేకపోతున్నారు. ఇండియాలో పిచ్‌ పరిస్థితులు బ్యాటింగ్‌, స్పిన్‌ బౌలింగ్‌కు అనుకూలిస్తాయన్న విషయం వాళ్లు అర్థం చేసుకుని ఉంటే బాగుండేది.

సెలక్షన్‌ మొత్తం తప్పుల తడక
ఈ టీమ్‌ సెలక్షన్‌ మొత్తం తప్పులతడకగా ఉంది. నసీం షా అందుబాటులో లేడని హసన్‌ అలీ చేతికి కొత్త బంతిని ఇస్తున్నారు. హసన్‌ అలీ కేవలం మేనేజ్‌మెంట్‌లోని కీలక సభ్యులతో తనకున్న ఫ్రెండ్షిప్‌ కారణంగానే జట్టులోకి వచ్చాడు.

ఇక ఉసామా మిర్‌.. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో ముల్తాన్‌ సుల్తాన్స్‌కు ఆడతాడు. ముస్తాక్‌ అహ్మద్‌కు చీఫ్‌ సెలక్టర్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌తో సత్సంబంధాలు ఉన్నాయి. స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా ఆటగాళ్ల ఎంపిక జరుగుతోంది. దేశానికి ప్రాతినిథ్యం వహించే జట్టు గురించి ఎవరికీ పట్టింపు లేదు. అలాంటపుడు ఇలాంటే ఫలితాలే వస్తాయి.

అప్పుడు నన్నైతే పక్కనపెట్టారు
అయినా.. పాకిస్తాన్‌ గతంలో ఇద్దరు లెగ్‌ స్పిన్నర్లతో బరిలోకి దిగిందే లేదు. షాహిద్‌ ఆఫ్రిది ఉన్నాడన్న కారణంగా వన్డే జట్టు నుంచి నన్ను తప్పించేవారు. ఈ టోర్నీలో చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ జరిగినపుడు షాదాబ్‌ ఖాన్‌ను తప్పించి ఉసామా మిర్‌ను రప్పించారు.

స్వార్థ ప్రయోజనాల కోసం
ఇమాద్‌ వసీం(లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌)ను జట్టులోకి ఎందుకు తీసుకోలేదు’’ అంటూ పాకిస్తాన్‌ మాజీ లెగ్‌ స్పిన్నర్‌ డానిష్‌ కనేరియా పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.  స్వప్రయోజనాల కోసం జట్టును భ్రష్టు పట్టిస్తున్నారంటూ సెలక్షన్‌ తీరుపై మండిపడ్డాడు. ఇకనైనా జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించకపోతే ఇలాంటి అవమానాలు మరిన్ని ఎదుర్కోక తప్పదంటూ ఘాటు విమర్శలు చేశాడు.

వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఇప్పటికే పాకిస్తాన్‌ చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుందన్న కనేరియా.. ఇకముందు కూడా కోలుకునే అవకాశం లేదంటూ కుండబద్దలు కొట్టాడు. కాగా భారత్‌ వేదికగా మెగా ఐసీసీ టోర్నీలో ఆరంభంలో వరుసగా రెండు విజయాలు సాధించిన పాకిస్తాన్‌.. ఆ తర్వాత మూడు పరాజయాలు చవిచూసింది.

బాబర్‌ ఆజంను తప్పించాలంటూ డిమాండ్లు
కనీవిని ఎరుగని రీతిలో వన్డే ఫార్మాట్లో అదీ మేజర్‌ ఈవెంట్లో అఫ్గనిస్తాన్‌ చేతిలో చిత్తుగా ఓడింది. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో మూడు ఓడి పట్టికలో ఐదో స్థానంలో ఉంది. పాకిస్తాన్‌ సెమీస్‌ రేసులో నిలవాలంటే మిగిలిన మ్యాచ్‌లలో గెలవాల్సిందే.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ ఓటములపై స్పందించిన డానిష్‌ కనేరియా ఈ మేరకు ఆజ్‌ తక్‌తో మాట్లాడుతూ పాక్‌ బోర్డు, సెలక్టర్లను ఉద్దేశించి విమర్శలు గుప్పించాడు. కాగా పాక్‌ వరుస ఓటములు నేపథ్యంలో కెప్టెన్‌గా బాబర్‌ ఆజంను తప్పించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.

చదవండి: WC 2023: టీమిండియాకు భారీ షాక్‌! హార్దిక్‌ పాండ్యా ఇక.. 

మరిన్ని వార్తలు