ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడులకు భారత ఎంవోయూ కారణం కావొచ్చు!

26 Oct, 2023 15:43 IST|Sakshi

వాషింగ్టన్‌: ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. భారత్‌-మిడిల్‌ ఈస్ట్‌-యూరప్‌ ఎకనామిక్‌ కారిడార్‌ ఒప్పందం కూడా దాడులకు ఒక కారణం అయ్యి ఉండొచ్చని వ్యాఖ్యానించారాయన. బుధవారం(అమెరికా కాలమానం ప్రకారం..) ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బెనీస్‌తో కలిసి పాతిక్రేయ సమావేశం నిర్వహించిన బైడెన్‌.. ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడుల గురించి స్పందించారు. 

హమాస్‌ దాడుల వెనక భారత్‌ మిడిల్‌ ఈస్ట్‌ యూరప్‌ ఎకనామిక్‌ కారిడార్‌ ప్రకటన కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు. దీనికి సంబంధించి రుజువులు మా దగ్గర లేకున్నా.. అది నేను నమ్ముతాను. ఇజ్రాయెల్ కోసం, ప్రాంతీయ సమైక్యత కోసం చేపట్టిన పురోగతి అది. కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లో ఆ కారిడార్‌ విషయంలో వెనక్కి తగ్గం అని బైడెన్‌ స్పష్టం చేశారు. 

న్యూఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు సందర్భంగా.. భారత్‌-మిడిల్‌ ఈస్ట్‌-యూరోపియన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ కోసం అవగాహన తాఖీదు(ఎంవోయూ) జరిగింది. భారత్‌తో పాటు అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, యూరోపియన్‌యూనియన్‌లు ఆ ఎంవోయూపై సంతకాలు చేశాయి.  ఆసియా, పశ్చిమాసియా, మిడిల్‌ ఈస్ట్‌, యూరప్‌ మధ్య ఆర్థిక మెరుగైన అనుసంధానం కోసం.. ముఖ్యంగా ఆర్థిక ఏకీకరణ ద్వారా కారిడార్ ఆర్థిక అభివృద్ధి కోసం ఈ ఎంవోయూ కుదర్చుకున్నాయి ఆయా దేశాలు. 

భారత్‌-మిడిల్‌ ఈస్ట్‌-యూరప్‌ ఎకనామిక్‌ కారిడార్‌ను రెండు ప్రత్యేక కారిడార్‌లుగా విభజించారు. తూర్పు కారిడార్‌ భారత్‌ నుంచి పశ్చిమ మధ్య ఆసియాను అనుసంధానిస్తుంది. అలాగే.. ఉత్తర కారిడార్‌ పశ్చిమ ఆసియాతో పాటు మిడిల్‌ ఈస్ట్‌ నుంచి యూరప్‌ను అనుసంధానిస్తుంది. తాజాగా ఈ కారిడార్‌పై బైడెన్‌ స్పందిస్తూ.. ఇది రెండు ఖండాల మధ్య పెట్టుబడి అవకాశాలను పెంపొదిస్తుందంటూ ప్రశంసలు సైతం గుప్పించారు.  ముఖ్యంగా సుస్థిరమైన మిడిల్‌ ఈస్ట్‌ నిర్మాణానికి ఈ కారిడార్‌ గుండా ఏర్పాటయ్యే రైల్వే పోర్ట్‌ ప్రాజెక్టు ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారాయన. 

మరోవైపు హమాస్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం 20వ రోజుకి చేరుకుంది. హమాస్‌ను తుడిచిపెట్టేంత వరకు విశ్రాంతి తీసుకునేది లేదంటూనే.. గాజాపై దాడుల్ని ఉధృతం చేయాలని తమ రక్షణ దళాన్ని ఆదేశించారు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ. మరోవైపు ఇజ్రాయెల్‌ బంధీల ద్వారా తమ డిమాండ్లు నెరవేర్చుకోవాలని హమాస్‌ భావిస్తోంది. 

మరిన్ని వార్తలు