యువరాజ్‌ సింగ్‌ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్ల రికార్డుకు 16 ఏళ్లు..!

19 Sep, 2023 18:04 IST|Sakshi

క్రికెట్‌ చరిత్రలో సెప్టెంబర్‌ 19కి ఓ ప్రత్యేకత ఉంది. 2007లో ఈ రోజున టీమిండియా డాషింగ్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాది చరిత్ర సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో యువీ చేసిన 12 బంతుల హాఫ్‌ సెంచరీ నేటికీ పొట్టి క్రికెట్‌లో ఫాస్టెప్ట్‌ హాఫ్‌ సెంచరీగా కొనసాగుతుంది. సౌతాఫ్రికాలో జరిగిన తొట్టతొలి టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ను ఉతికి 'ఆరే'శాడు.

వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది క్రికెట్‌ ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా చేశాడు. యువీ సిక్సర్ల సునామీకి ముందు ఇంగ్లండ్‌ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్‌ అతనితో అనవసర గొడవకు దిగాడు. దీని ప్రభావం బ్రాడ్‌పై పడింది. ఫ్లింటాఫ్‌పై కోపాన్ని యువీ బ్రాడ్‌పై చూపించాడు. యువీ.. బ్రాడ్‌ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. కేవలం 12 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి, నేటికీ చెక్కుచెదరని టీ20 ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు.

ఆ ఇన్నింగ్స్‌లో మొత్తం 16 బంతులు ఎదుర్కొన్న యువరాజ్‌ కేవలం 14 నిమిషాలు క్రీజ్‌లో ఉండి 7 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 58 పరుగులు చేసి, ఫ్లింటాఫ్‌ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. యువీకి ముందు గంభీర్‌ (58), సెహ్వాగ్‌ (68) సైతం అర్ధసెంచరీలతో రాణించారు.

అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి, లక్ష్యానికి 19 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఫలితంగా భారత్‌ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో ఇర్ఫాన్‌ పఠాన్‌ 3 వికెట్లు పడగొట్టగా.. ఆర్పీ సింగ్‌ 2, హర్భజన్‌ సింగ్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. ఇదే మ్యాచ్‌ ప్రస్తుత భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు టీ20ల్లో తొలి మ్యాచ్‌ కావడం విశేషం. ఈ మెగా టోర్నీ ఫైనల్లో భారత్‌.. పాక్‌ను మట్టికరిపించి తొట్టతొలి టీ20 ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. 
 
 

మరిన్ని వార్తలు