జాగ్రత్త.. నోరు అదుపులో పెట్టుకోండి: అక్తర్‌ ఫైర్‌

27 Nov, 2020 13:19 IST|Sakshi

‘న్యూజిలాండ్‌ క్రికెట్’‌పై మండిపడిన షోయబ్‌ అక్తర్‌

ఇస్లామాబాద్‌: తమ క్రికెటర్లకు న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ఇచ్చిన ‘ఫైనల్‌ వార్నింగ్‌’పై పాకిస్తాన్‌ దిగ్గజ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ ఫైర్‌ అయ్యాడు. తమదేమీ క్లబ్‌ టీం కాదని, జాతీయ జట్టు అన్న సంగతి గుర్తుంచుకోవాలని హితవు పలికాడు. ఒకవేళ పరిస్థితులు చేయిదాటిపోతే సిరీస్‌ రద్దు చేసుకుంటామే తప్ప డబ్బు కోసం వెంపర్లాడే తత్వం తమది కాదంటూ చురకలు అంటించాడు. కాగా కివీస్‌తో సిరీస్‌లో భాగంగా పాక్‌ జట్టు ఈనెల 24న న్యూజిలాండ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఆరుగురు పాక్‌ క్రికెటర్లకు వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో వారిని ఐసోలేషన్‌కు తరలించగా, కొంతమంది కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారని, మరొకసారి ఇది పునరావృతమైతే జట్టును తిరిగి పంపేస్తామని ఎన్‌జెడ్‌సీ హెచ్చరించినట్లు వార్తలు వెలువడ్డాయి. (చదవండి: దేశ ప్రతిష్టతో ముడిపడిన అంశం.. జాగ్రత్త)

ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు సైతం తమ ఆటగాళ్లను జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్‌ ఇచ్చింది. ఈ విషయంపై రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ అక్తర్‌ తన యూట్యూట్‌ చానెల్‌ వేదికగా స్పందించాడు. ‘‘ న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డుకు ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నా. మీరు మాట్లాడుతోంది ఓ క్లబ్‌ జట్టు గురించి కాదు. పాకిస్తాన్‌ జాతీయ జట్టు గురించి అని గుర్తుంచుకోండి. మాకు మీరు అవసరం లేదు. మా క్రికెట్‌ ముగిసిపోలేదు. మాకు డబ్బు యావ లేదు. నిజానికి మ్యాచ్‌లు ప్రసారం చేసి మీరు డబ్బు సంపాదిస్తున్నారు. కఠిన సమయాల్లో కూడా మీ దేశంలో పర్యటించేందుకు మా జట్టు సిద్ధమైంది.  కాబట్టి మీరే మాకు రుణపడి ఉన్నారు. ఈ భూగ్రహం మీదే అత్యంత గొప్పదైన పాకిస్తాన్‌ గురించి మీరు ఇలా మాట్లాడతారా? నోరు అదుపులో పెట్టుకోండి. మరోసారి మాట తూలితే జాగ్రత్త. టీ20 సిరీస్‌లో పాకిస్తాన్‌ జట్టు మిమ్మల్ని చిత్తు చేస్తుంది’’ అంటూ కివీస్‌ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భాగంగా పాక్‌ 3 టీ20లు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.  

మరిన్ని వార్తలు