IPL 2023: ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరం! వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీకి కూడా

5 Apr, 2023 08:25 IST|Sakshi

Shreyas Iyer- KKR- WTC Final: భారత క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఐపీఎల్‌ టోర్నీ మొత్తానికి, జూన్‌లో జరిగే ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు దూరమయ్యాడు. అయ్యర్‌ వెన్ను గాయానికి శస్త్ర చికిత్స విదేశంలో జరగనుందని... అతను కోలుకోవడానికి కనీసం ఐదారు నెలలు పడుతుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది అక్టోబర్‌–నవంబర్‌లో భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి కూడా అయ్యర్‌ అందుబాటులో ఉంటాడో లేదో ఇప్పుడే చెప్పలేమని బీసీసీఐ వర్గాలు వివరించాయి.  

టెస్టు సిరీస్‌లో విఫలం
కాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ 2023 సిరీస్‌కు ముందు గాయపడ్డ శ్రేయస్‌... రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చాడు. అయితే, మూడో మ్యాచ్‌ సందర్భంగా వెన్నునొప్పి తిరగబెట్టడంతో మళ్లీ జట్టు (ఆడిన రెండు టెస్టుల్లో చేసిన పరుగులు 42)కు దూరమయ్యాడు. ఈ క్రమంలో సర్జరీ చేయించుకునే క్రమంలో విదేశాలకు వెళ్లనున్న అయ్యర్‌ ఐపీఎల్‌ 16వ సీజన్‌ మొత్తానికి దూరం కానున్నాడు. కనీసం ఐదు నెలల పాటు విశ్రాంతి అవసరమైన తరుణంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడే పరిస్థితి లేకుండా పోయింది. 

అదే విధంగా మరికొన్నాళ్ల పాటు రెస్ట్‌ అవసరం అనుకుంటే వరల్డ్‌కప్‌- 2023 టోర్నీకి కూడా దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఇక శ్రేయస్‌ అయ్యర్‌ దూరం కావడంతో ఇప్పటికే ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అతడి స్థానంలో నితీశ్‌ రాణాకు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది.

ఈ క్రమంలో పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా ఏడు పరుగుల తేడాతో ఓడి పరాజయంతో సీజన్‌ను ఆరంభించింది. అయ్యర్‌కు తోడు స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌, మరో బంగ్లా బ్యాటర్‌ లిటన్‌ దాస్‌ సైతం తమ దేశం తరఫున సిరీస్‌ ఆడేందుకు జట్టుకు దూరమైన నేపథ్యంలో కేకేఆర్‌కు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి.

చదవండి: గుజరాత్‌ టైటాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. కేన్‌మామ స్థానంలో లంక ఆల్‌రౌండర్‌

మరిన్ని వార్తలు