CWC 2023 IND Vs AUS Finals: వరల్డ్‌కప్‌ ఫైనల్‌.. రిహార్సల్స్‌ మొదలెట్టేసిన సూర్యకిరణ్‌ టీమ్‌! వీడియోలు వైరల్‌

17 Nov, 2023 17:14 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో తుది సమరానికి రంగం సిద్దమైంది. నవంబర్‌ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న ఫైనల్లో ఆస్ట్రేలియా- భారత జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. 20 ఏళ్ల తర్వాత మరోసారి వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఈ రెండు జట్లు తలడనునున్నాయి. ఆసీస్‌-భారత జట్లు చివరగా 2003 వరల్డ్‌కప్‌ ఫైనల్లో తలపడ్డాయి.

అప్పుడు అనూహ్యంగా టీమిండియా.. ఆసీస్‌ చేతిలో ఓటమి పాలైంది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ప్రస్తతం భారత జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆజేయంగా నిలిచిన టీమిండియా.. ఆసీస్‌ను కూడా చిత్తుచేసి 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని భావిస్తోంది. ఇక అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న ఫైనల్‌ పోరును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా డిప్యూటీ పీఎం రిచర్డ్ మార్లెస్ ప్రత్యేక్షంగా వీక్షించనున్నారు.

వీరితో పాటు పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్.. సహా పలువురు ప్రముఖులు మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించనున్నారు. ఈ క్రమంలో వరల్డ్‌కప్‌ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. 

భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్‌ ఏరోబాటిక్‌ బృందం విన్యాసాలు చేయబోతోంది.  తుది పోరు మొదలయ్యే పది నిమిషాల ముందు మోడీ స్టేడియంపై సూర్యకిరణ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఆకాశంలో అద్భుత విన్యాసాలతో అలరించనున్నాయి. ఇందులో మొత్తం తొమ్మిది ఎయిర్‌క్రాఫ్ట్‌లు పాల్గోనున్నట్లు తెలుస్తోంది.


ఏరోబాటిక్‌ టీమ్‌ రిహార్సల్స్‌..
ఈనేపథ్యంలో ఏరోబాటిక్‌ టీమ్‌ తాజాగా రిహార్సల్స్‌ ను మొదలు పెట్టేసింది. శుక్రవారం స్టేడియంపై యుద్ధ విమానాల చక్కర్లు కొడుతూ సందడి చేశాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు  సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.
చదవండి: WC 2023: 20 ఏళ్ల తర్వాత ఆసీస్‌తో ఫైనల్‌ పోరు.. టీమిండియా బదులు తీర్చుకుంటుందా?

మరిన్ని వార్తలు