SL Vs IRE 2nd Test: సెంచరీలతో విధ్వంసం.. పసికూనపై లంక ఓపెనర్ల ప్రతాపం

26 Apr, 2023 18:54 IST|Sakshi

ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతుంది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 357 పరుగులు చేసింది. నిషాన్‌ మధుష్క 149 బ్యాటింగ్‌, కుషాల్‌ మెండిస్‌ 83 బ్యాటింగ్‌ క్రీజులో ఉన్నారు. టీ విరామం అనంతరం మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం ఎంతకు తగ్గకపోవడంతో అంపైర్లు 23 ఓవర్లు మిగిలి ఉండగానే మూడోరోజు ఆట ముగిసిందని ప్రకటించారు.

అంతకముందు లంక ఓపెనర్లు దిముత్‌ కరుణరత్నే (133 బంతుల్లో 115 పరుగులు, 15 ఫోర్లు), నిషాన్‌ మధుష్క 234 బంతుల్లో 149 బ్యాటింగ్‌, 18 ఫోర్లు, ఒక సిక్సర్‌) సెంచరీలతో చెలరేగారు. లంక ఓపెనర్ల దెబ్బకు ఐర్లాండ్‌ బౌలర్లు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 228 పరుగులు జోడించారు. ఆఖరికి కర్టిస్‌ కాంపర్‌ ఈ జోడిని విడదీశాడు. 115 పరుగులు చేసిన కరుణరత్నే కాంపర్‌ బౌలింగ్‌లో మాథ్యూ హంఫ్రెస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కుషాల్‌ మెండిస్‌ వన్డే తరహా బ్యాటింగ్‌ ఆడాడు. దీంతో లంక స్కోరు పరుగులు పెట్టింది. 62 బంతుల్లో అర్థశతకం మార్క్‌ అందుకున్న మెండిస్‌ 83 పరుగులతో అజేయంగా ఆడుతున్నాడు. మ్యాచ్‌కు మరో రెండురోజులు సమయం ఉండడంతో ఫలితం వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అంతకముందు ఐర్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 492 పరుగులకు ఆలౌట్‌ అయింది.

చదవండి: 580 రోజుల తర్వాత టాస్‌ నెగ్గిన కోహ్లి..

మరిన్ని వార్తలు