SRH VS LSG: పూనకం వచ్చినట్లు ఊగిపోయిన పూరన్‌.. మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు..!

13 May, 2023 19:32 IST|Sakshi
PC: IPL Twitter

లక్నో మిడిలార్డర్‌ బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌ మరోసారి పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో క్రీజ్‌లోకి వచ్చీ రాగానే హ్యాట్రిక్‌ సిక్సర్లతో విరుచుకుపడి మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. అప్పటిదాకా సన్‌రైజర్స్‌కు ఫేవర్‌గా ఉన్న మ్యాచ్‌ను పూరన్‌.. మూడు బంతుల్లో మలుపు తిప్పాడు.

వివరాల్లోకి వెళితే.. సన్‌రైజర్స్‌ నిర్ధేశించిన 183 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో 15.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఈ దశలో బరిలోకి దిగిన పూరన్‌.. అభిషేక్‌ శర్మ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాది మ్యాచ్‌ను లక్నోవైపు తిప్పాడు. అభిషేక్‌ శర్మ వేసిన ఈ ఓవర్‌లో మొత్తం 31 పరుగులు వచ్చాయి. పూరన్‌కు ముందు స్టోయినిస్‌ సైతం రెండు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

అయితే స్టోయినిస్‌ అదే ఓవర్‌లో అభిషేక్‌ ఉచ్చులో చిక్కి ఔటయ్యాడు.  16 ఓవర్‌ తర్వాత సమీకరణలు 24 బంతుల్లో 38 పరుగులుగా మారాయి. చేతిలో మరో 7 వికెట్లు ఉండటంతో లక్నో గెలుపుపై ధీమాగా ఉంది. అంతకుముందు ఇదే సీజన్‌లో పూరన్‌ ఇదే తరహాలో రెచ్చిపోయి, చేదాటిపోయిన మ్యాచ్‌ను గెలిపించాడు. ఆర్సీబీతో జరిగిన ఆ మ్యాచ్‌లో పూరన్‌ 15 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసి తన జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు. 

ఇదిలా ఉంటే, లక్నోతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (36), రాహుల్‌ త్రిపాఠి (20), మార్క్రమ్‌ (28), క్లాసెన్‌ (47), అబ్దుల్‌ సమత్‌ (37 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు సాధించగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ (0), అభిషేక్‌ శర్మ (7) విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో కృనాల్‌ 2, యుద్ద్‌వీర్‌ సింగ్‌, యశ్‌ ఠాకూర్‌, అమిత్‌ మిశ్రా, ఆవేశ్‌ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఛేదనలో లక్నో 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసి విజయం దిశగా సాగుతుంది.

మరిన్ని వార్తలు