కీలక మ్యాచ్‌: వృద్ధిమాన్‌ సాహా ఔట్‌

6 Nov, 2020 19:07 IST|Sakshi

అబుదాబి: ఐపీఎల్ 2020 సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు  చేరుకుని మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నేడు ఎలిమినేటర్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. వరుసగా ఐదోసారి ప్లే ఆఫ్స్ చేరుకున్న హైదరాబాద్ సెకండ్ టైటిల్‌పై గురిపెట్టగా.. మూడేళ్ల తర్వాత నాకౌట్‌కు వచ్చిన బెంగళూరు ఈసారైనా టైటిల్‌ గెలవాలనే పట్టుదలతో ఉంది. మరి చివరి మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఊపు మీదున్న సన్‌రైజర్స్ జోరు కొనసాగిస్తుందై..? గత నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి డీలాపడ్డ ఆర్‌సీబీ పుంజుకుంటుందా?  అనేది చూడాలి. క్వాలిఫయర్‌-2లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడే జట్టు ఏదో తేలిపోనుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ ముందుగా ఫీల్డింగ్‌  తీసుకుంది. ఈ మ్యాచ్‌కు సన్‌రైజర్స్‌ కీలక ఆటగాడు సాహా దూరమయ్యాడు. గాయం కారణంగా సాహా వైదొలిగాడు. అతని స్థానంలో శ్రీవాట్స్‌ గోస్వామి తుది జట్టులోకి వచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు లీగ్‌ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టుకు మాత్రం ఫైనల్‌ చేరేందుకు ఆదివారం ఢిల్లీతో జరిగే రెండో క్వాలిఫయర్‌ ద్వారా మరో అవకాశం ఉంటుంది. టోర్నీ ఆరంభంలో తడబడినా...ఇప్పుడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తుది జట్టు సమతూకంగా ఉంది. ఓపెనింగ్‌తో పాటు మిడిలార్డర్‌లో మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, అబ్దుల్ల్ సమద్‌ బాధ్యతగా ఆడాల్సి ఉంది. తుది జట్టులో అభిషేక్ శర్మ, ప్రియామ్ గార్గ్‌లలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. ఆల్‌రౌండర్‌ జాసన్ హోల్డర్‌ రాకతో కూడా హైదరాబాద్‌ బలం పెరిగింది. రషీద్ ఖాన్, నదీమ్‌ స్పిన్‌ కీలకం కానుండగా...సందీప్‌ శర్మ మరోసారి చెలరేగాలని పట్టుదలగా ఉన్నాడు. గత మూడు మ్యాచ్‌ల్లో రాణించినట్లు మరోసారి చెలరేగితో వార్నర్ సేనకు తిరుగుండదు.

అదృష్టవశాత్తూ రన్‌రేట్‌ సహకారంతో ప్లే ఆఫ్స్‌కు చేరినా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. నాలుగు వరుస ఓటములతో ఆ జట్టు పూర్తిగా డీలాపడిపోయింది. ఏబీ డివిలియర్స్‌పై అతిగా ఆధారపడుతుండటం, కోహ్లీ తన స్థాయికి తగినట్లుగా ఆడకపోవడం కూడా జట్టును దెబ్బ తీస్తోంది. ఇప్పటి వరకు పడిక్కల్‌ ఒక్కడే నిలకడైన ప్రదర్శన చేశాడు. అతనికి తోడుగా ఫిలిప్ రాణించలేకపోతున్నాడు. పడిక్కల్ కూడా ధాటిగా ఆడలేకపోతున్నాడు. మంచి బౌలింగ్ లైనప్ ఉన్న సన్‌రైజర్స్‌పై ఓపెనర్లు మంచి ఆరంభం అందిస్తేనే ఆర్‌సీబీ భారీ స్కోరు చేయగలదు. అయితే ఏబీ, విరాట్‌లను ఔట్‌ చేస్తే పతనం మొదలైపోతుందని లీగ్‌లో ఇప్పటికే నిరూపితమైంది. బౌలింగ్‌లో స్పిన్నర్లు సుందర్, చహల్‌ కీలకం కానున్నారు. జట్టును గాయాలు కూడా వేధిస్తున్నాయి. మోరిస్, సైనీ పూర్తిగా కోలుకోలేదు. సిరాజ్‌నుంచి జట్టు మరో చక్కటి ప్రదర్శన ఆశిస్తోంది. మోరిస్ కోలుకోకుంటే మోయిన్ అలీ జట్టులోకి రావచ్చు.

ఐపీఎల్‌-2020లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లో చెరో విజయం నమోదు చేసుకున్నాయి. తొలి పోరులో బెంగళూరు 10 పరుగులతో గెలవగా, తర్వాతి మ్యాచ్‌లో హైదరాబాద్‌ 5 వికెట్లతో నెగ్గింది. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు 17 సార్లు తలపడగా హైదరాబాద్‌ 9, ఆర్సీబీ 7 విజయాలు సాధించాయి.  ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇక ఆర్సీబీ వరుసగా నాలుగు మ్యాచ్‌లో ఓటమి పాలై నాల్గో స్థానానికి చేరగా, కచ్చితంగా మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధిస్తేనే ప్లేఆఫ్స్‌ రేసులో ఉంటామన్న  దశలో ఆరెంజ్‌ ఆర్మీ ఇరగదీసింది. వరుస మూడు విజయాలతో మూడో స్థానంలో నిలిచింది. ఇది డేవిడ్‌ వార్నర్‌ గ్యాంగ్‌ సానుకూలాంశము.

ఆర్సీబీ
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), దేవదూత్‌ పడిక్కల్‌, అరోన్‌ ఫించ్‌,  ఏబీ డివిలియర్స్‌, మొయిన్‌ అలీ, వాషింగ్టన్‌ సుందర్‌, శివం దూబే, నవదీప్‌ సైనీ, ఆడమ్‌ జంపా, సిరాజ్‌, చహల్‌

ఎస్‌ఆర్‌హెచ్‌
డేవిడ్‌ వార్నర్(కెప్టెన్‌)‌, శ్రీవాట్స్‌ గోస్వామి, మనీష్‌ పాండే, కేన్‌ విలియమ్సన్‌, ప్రియాం గార్గ్‌, జేసన్‌ హోల్డర్‌, అబ‍్దుల్‌ సామద్‌, రషీద్‌ ఖాన్‌, షహబాజ్‌ నదీమ్‌, సందీప్‌ శర్మ, నటరాజన్‌
 

మరిన్ని వార్తలు