Asia Cup 2022 Final: పాకిస్తాన్‌పై ఘన విజయం.. లంకదే ఆసియా కప్‌

11 Sep, 2022 23:24 IST|Sakshi

15వ ఎడిషన్‌ ఆసియా కప్‌ విజేతగా శ్రీలంక అవతరించింది. ఆదివారం దుబాయ్‌ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను 23 పరుగుల తేడాతో మట్టికరిపించి ట్రోఫిని అందుకుంది. 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. మహ్మద్‌ రిజ్వాన్‌(55 పరుగులు), ఇఫ్తికర్‌ అహ్మద్‌(32 పరుగులు) క్రీజులో ఉన్నంత వరకు లక్ష్యం దిశగానే సాగింది. అయితే లంక బౌలర్‌ ప్రమోద్‌ మదుషన్‌ నాలుగు వికెట్లతో పాక్‌ పతనాన్ని శాసించగా.. స్టార్‌ స్పిన్నర్‌ వనిందు హసరంగా కీలక సమయంలో మూడు వికెట్లతో మెరిశాడు.

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. బానుక రాజపక్స 45 బంతుల్లో 71, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. వనిందు హసరంగా 21 బంతుల్లో 36 పరుగులతో రాణించాడు. అంతకముందు దనుంజయ డిసిల్వా 28 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే 58 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో వనిందు హసరంగాతో కలిసి రాజపక్స ఆరో వికెట్‌కు 58 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.

36 పరుగులు చేసి హసరంగా వెనుదిరిగిన తర్వాత రాజపక్స పాక్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఒకవైపు చమిక కరుణరత్నే(14 బంతుల్లో 14 పరుగులు) చక్కగా సహకరించడంతో చివరి ఐదు ఓవర్లలో 64 పరుగులు రావడం విశేషం.పాకిస్తాన్‌ బౌలర్లలో హారిస్‌ రౌఫ్‌ 3, నసీమ్‌ షా, షాదాబ్‌ ఖాన్‌, ఇఫ్తికర్‌ అహ్మద్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.

కాగా శ్రీలంక ఆసియా కప్‌ను సొంతం చేసుకోవడం ఇది ఆరోసారి. తాజాగా దాసున్‌ షనక కెప్టెన్సీలో లంక టైటిల్‌ నెగ్గగా.. చివరగా 2014లో ఏంజల్లో మాథ్యూస్‌ నేతృత్వంలోని లంక జట్టు వన్డే ఫార్మాట్‌లో జరిగిన అప్పటి ఆసియా కప్‌లోనూ పాక్‌ను ఫైనల్లో ఓడించి విజేతగా నిలిచింది. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు