వారిద్దరే మా కొంపముంచారు.. చాలా విషయాలు నేర్చుకున్నాం: స్మిత్‌

25 Sep, 2023 13:33 IST|Sakshi

ఇండోర్‌ వేదికగా భారత్‌తో జరిగిన రెండో వన్డేలో 99 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 0-2 తేడాతో ఆసీస్‌ కోల్పోయింది. బ్యాటింగ్‌ , బౌలింగ్‌ రెండు విభాగాల్లో ఆస్ట్రేలియా విఫలమైంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో శ్రేయస్‌ అయ్యర్‌(105), శుబ్‌మన్‌ గిల్‌ అద్భుత సెంచరీలతో చెలరేగగా.. సూర్యకుమార్‌ యాదవ్‌( 72 నాటౌట్‌), కేఎల్‌ రాహుల్‌(52) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. 

అనంతరం వర్షం కారణంగా ఆ్రస్టేలియా లక్ష్యాన్ని 33 ఓవర్లలో 317 పరుగులుగా (డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం) నిర్దేశించారు. ఆసీస్‌ 28.2 ఓవర్లలో 217 పరగులకు ఆలౌటైంది. ఆసీస్‌ బ్యాటరల్లో సీన్‌ అబాట్‌(54) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అశ్విన్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. జడేజా, ప్రసిద్ద్‌ కృష్ణ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ  ఓటమిపై మ్యాచ్‌ అనంతరం ఆస్ట్రేలియా స్టాండింగ్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ స్పందించాడు.

"ఇండోర్‌ వికెట్‌ బ్యాటింగ్‌కు మంచిగా అనుకూలించింది. నిజంగా గిల్‌, శ్రేయస్‌ తమ అద్భుత బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను మా నుంచి దూరం చేశారు. కేఎల్‌, సూర్య బ్యాటింగ్‌ తీరు కూడా అత్యుత్తమం. అయితే వర్షం పడిన తర్వాత పిచ్‌కు అనుకూలించింది. బంతి అద్బుతంగా స్పిన్‌ అయింది. మేము దక్షిణాఫ్రికాపై కూడా అన్ని మ్యాచ్‌లను ఓడిపోయాం.

ఇక్కడే అదే కొనసాగిస్తున్నాము. మేము గత కొన్ని ఓటములనుంచి చాలా విషయాలు నేర్చకున్నాం. మా తదుపరి మ్యాచ్‌లో ఇటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా ప్రయత్నిస్తాం. వరల్డ్‌కప్‌కు ముందు మా రిథమ్‌ను తిరిగి పొందడం చాలా ముఖ్యమని" పోస్ట్‌మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో స్మిత్‌ పేర్కొన్నాడు.
చదవండి: IND vs AUS: రాహులా మజాకా.. దెబ్బకు స్టేడియం బయటకు బంతి! వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు