స్టోయినిస్‌ చెలరేగిపోయాడు..

20 Sep, 2020 21:31 IST|Sakshi

20 బంతుల్లో ఫిఫ్టీ కొట్టేశాడు..

దుబాయ్‌: ఐపీఎల్‌-13వ సీజన్‌లో కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కష్టాల్లో పడ్డ సమయంలో ఆల్‌రౌండర్‌ స్టోయినిస్‌ మెరుపులు మెరిపించాడు. 20 బంతుల్లో  సిక్స్‌లు, ఫోర్లు మోత మోగించి హాఫ్‌ సెంచరీ సాధించాడు. దాంతో ఢిల్లీ స్కోరు బోర్డును 150 పరుగులు దాటింది. ఢిల్లీ 110 పరుగులైనా చేస్తుందా అనే సమయంలో స్టోయినిస్‌ చెలరేగిపోయాడు.  బౌలర్‌ ఎవరైనా వీరబాదుడే లక్ష్యంగా బౌండరీల మోత మోగించాడు. కాట్రెల్‌ వేసిన 19 ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన స్టోయినిస్‌.. చివరి ఓవర్‌లో మాత్రం ఐదు బంతుల్ని బౌండరీ దాటించాడు.(చదవండి: పంత్‌ వెనకాలే.. అయ్యర్‌!)

జోర్డాన్‌ వేసిన ఆఖరి ఓవర్‌ తొలి బంతిని సిక్స్‌ కొట్టిన స్టోయినిస్‌.. రెండో బంతిని ఫోర్‌ కొట్టాడు. మూడు, నాలుగు బంతుల్ని ఫోర్లు కొట్టిన స్టోయినిస్‌.. ఐదో బంతిని సిక్స్‌ కొట్టాడు. ఆరో బంతి నో బాల్‌ కాగా, స్టోయినిస్‌ రనౌట్‌ అయ్యాడు. చివరి ఓవర్‌లో 24 పరుగుల్ని స్టోయినిస్‌ రాబట్టాడు.  21 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53 పరుగుల్ని స్టోయినిస్‌ సాధించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు చేసింది. స్టోయినిస్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేయడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. పంజాబ్‌ బౌలర్లలో షమీ మూడు వికెట్లు సాధించగా, కాట్రెల్‌ రెండు వికెట్లు సాధించాడు. రవిబిష్నోయ్‌కి వికెట్‌ దక్కింది.  రిషభ్‌ పంత్‌ భారీ షాట్‌ ఆడే క్రమంలో బౌల్డ్‌ అయ్యాడు. రవిబిష్నోయ్‌ స్పిన్‌ చేస్తూ కాళ్ల మధ్య వేసిన బంతిని ఆడబోయి పంత్‌ వికెట్‌ను సమర్పించుకున్నాడు. పంత్‌ 14 ఓవర్‌ చివరి బంతికి ఔట్‌ అయితే, ఆపై 15 ఓవర్‌ తొలి బంతికి అయ్యర్‌ ఔటయ్యాడు. పంత్‌ వెనకాలే అయ్యర్‌ ఔట్‌ కావడంతో ఢిల్లీ మరోసారి కష్టాల్లో పడింది. 87 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయిన తరుణంలో స్టోయినిస్‌ మ్యాచ్‌ను మొత్తం మార్చేశాడు.

కింగ్స్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ 13 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి వికెట్‌గా శిఖర్‌ ధావన్‌ పెవిలియన్‌ చేరగా, ఆపై మరో నాలుగు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లను ఢిల్లీ చేజార్చుకుంది. ధావన్‌ అనవసరపు రన్‌ కోసం యత్నించి రనౌట్‌ కాగా, పృథ్వీ షా(5), హెట్‌మెయిర్‌(7)లను మహ్మద్‌ షమీ పెవిలియన్‌కు పంపాడు. కాస్త బౌన్స్‌ను మిక్స్‌ చేసి షమీ వేసిన లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బంతులకు పృథ్వీ షా, హెట్‌మెయిర్‌లు ఔటయ్యారు.  షమీ వేసిన నాల్గో ఓవర్‌ మూడో బంతికి పృథ్వీ షా రెండో వికెట్‌గా ఔట్‌ కాగా, ఆ ఓవర్‌ చివరి బంతికి హెట్‌మెయిర్‌ పెవిలియన్‌ చేరాడు.  షమీ ఒకే ఓవర్‌లో ఇద్దరి బ్యాట్స్‌మన్‌ ఔట్‌ చేయడంతో ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కింగ్స్‌ పంజాబ్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటింగ్‌కు దిగింది. 
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు