Asia Cup Qualifiers: సునీల్‌ ఛెత్రీ అరుదైన రికార్డు.. మెస్సీకి రెండు అడుగుల దూరంలో

15 Jun, 2022 14:06 IST|Sakshi

ఫుట్‌బాల్‌ స్టార్‌.. భారత ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రీ అరుదైన ఘనత సాధించాడు. ఏఎప్‌సీ ఆసియా కప్‌ క్వాలిఫయర్స్‌లో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో సునీల్‌ ఛెత్రీ ఆట 45వ నిమిషంలో గోల్‌తో మెరిశాడు. ఈ గోల్‌ సునీల్‌ ఛెత్రీకి 84వ అంతర్జాతీయ గోల్‌ కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే హంగేరీ ఫుట్‌బాల్‌ దిగ్గజం ఫెరెన్క్ పుస్కాస్‌తో సమానంగా టాప్‌-5లో నిలిచాడు. పుస్కాస్‌ కూడా హంగేరీ తరపున 84 అంతర్జాతీయ గోల్స్‌ కొట్టాడు.

ఇక టాప్‌ ఫోర్‌లో పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో(117 గోల్స్‌),  ఇరాన్‌ స్టార్‌ అలీ దాయి (109 గోల్స్‌) రెండో స్థానంలో.. మొఖ్తర్ దహరి (89 గోల్స్‌) మూడో స్థానంలో.. అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సీ 86 గోల్స్‌తో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక మెస్సీకి, సునీల్‌ ఛెత్రీకి మధ్య గోల్స్‌ వ్యత్యాసం రెండు మాత్రమే ఉండడం విశేషం. అంతర్జాతీయంగా ఎక్కువ గోల్స్‌ కొట్టిన టాప్‌-10 జాబితాలో రొనాల్డో, మెస్సీ, సునీల్‌ ఛెత్రీ, అలీ మొబ్‌కూత్‌(80 గోల్స్‌, యూఏఈ) మాత్రమే  ప్రస్తుతం ఆడుతున్నారు.

ఇక ఆసియా కప్ గ్రూప్-డి క్వాలిఫయర్స్‌లో భాగంగా హంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-0 తేడాతో ఘన విజయం అందుకుంది టీమిండియా. ఈ విజయంతో టేబుల్ టాపర్‌గా ఆసియా కప్ 2023 టోర్నీలో ఆడనుంది. ఈ మ్యాచ్‌కి ముందు టేబుల్ టాపర్‌గా ఉన్న హాంకాంగ్‌పై ఆది నుంచి భారత్‌ ఎదురుదాడికి దిగింది. ఆట రెండో నిమిషంలోనే గోల్ సాధించి, హంగ్‌ కాంగ్‌ని ఒత్తిడిలోకి నెట్టేసింది. ఆట ప్రారంభమైన రెండో నిమిషంలో అన్వర్ ఆలీ గోల్ సాధించి, భారత జట్టుకి 1-0 ఆధిక్యం అందించాడు.

తొలి సగం ముగుస్తుందనగా ఆట 45వ నిమిషంలో భారత కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రీ గోల్‌ చేసి టీమిండియాను 2-0 ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత హాంకాంగ్‌ గోల్ చేసేందుకు చేసిన ప్రయత్నాలను తిప్పి కొట్టిన భారత జట్టు.. ఆట 85వ నిమిషంలో మూడో గోల్ చేసింది. మన్వీర్ సింగ్ గోల్‌తో టీమిండియా ఆధిక్యం 3-0కి దూసుకెళ్లింది. నిర్ణీత సమయం అనంతరం ఇచ్చిన అదనపు సమయంలో ఆట 90+3వ నిమిషంలో ఇషాన్ పండిట గోల్ సాధించడంతో భారత జట్టు 4-0 తేడాతో తిరుగులేని విజయాన్ని అందుకుంది.  

చదవండి: Asian Cup 2023: భారత ఫుట్‌బాల్‌ జట్టు కొత్త చరిత్ర.. వరుసగా రెండోసారి

మరిన్ని వార్తలు