Sunil Gavaskar: 'ఇండోర్‌కే మూడిస్తే.. మరి గబ్బాకు ఎన్నివ్వాలి?'

4 Mar, 2023 18:48 IST|Sakshi

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా మూడో టెస్టుకు వేదికైన ఇండోర్ పిచ్ నాసిరకంగా ఉంద‌ని పేర్కొన్న ఐసీసీ మూడు డీమెరిట్ పాయింట్లు విధించిన విష‌యం తెలిసిందే. రెండురోజుల్లోనే 30 వికెట్లు కూలడం.. మూడు రోజుల్లోనే మ్యాచ్‌ ముగిసిపోవడం విమర్శలకు దారి తీసింది. అయితే ఐసీసీ డీమెరిట్‌ పాయింట్లు విధించడంపై టీమిండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

''ఇండోర్‌ పిచ్‌కు ఐసీసీ మూడు డీమెరిట్‌ పాయింట్లు ఇవ్వడం నాకు నచ్చలేదు. అయితే ఒక విషయం తెలుసుకోవాలని ఉంది. గతేడాది నవంబర్‌లో బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా జరిగిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌ రెండురోజుల్లోనే ముగిసింది. మరి ఈ పిచ్‌కు ఐసీసీ ఎన్ని డీమెరిట్‌ పాయింట్లు కేటాయించింది.? అప్పుడు మ్యాచ్‌ రిఫరీ ఎవరు?'' అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. 

గతేడాది న‌వంబ‌ర్‌లో గ‌బ్బాలో ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మొద‌టి టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది. ఆ మ్యాచ్‌లో ఆతిథ్య ఆసీస్ విజ‌యం సాధించింది.ఆ త‌ర్వాతి టెస్టుల్లోనూ గెలుపొందిన ఆసీస్ సిరీస్ క్లీన్‌స్వీప్ చేసింది. బౌలర్లకు ఎక్కువగా సహకరించిన గబ్బా పిచ్‌కు ఐసీసీ అప్పట్లో ఒక్క డీమెరిట్‌ పాయింట్‌తో తక్కువ యావరేజ్‌తో రేటింగ్‌ ఇచ్చింది. ఇదే విషయాన్ని లేవనెత్తిన గావస్కర్‌ ఐసీసీ వైఖరిని తప్పుబట్టాడు. 

ఇక మూడో టెస్టులో టీమిండియా అనూహ్యంగా ఓట‌మి పాలైంది. ఆస్ట్రేలియా చేతిలో 9 వికెట్ల తేడాతో ఓట‌మి పాలైంది. 2012 నవంబ‌ర్ త‌ర్వాత సొంత గ‌డ్డ‌పై భార‌త్‌కు ఇది టెస్టుల్లో తొలి ఓట‌మి కావ‌డం విశేషం. 76 ప‌రుగుల ల‌క్ష్యంతో మూడో రోజు బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రీలియా తొలి సెష‌న్‌లోనే విజ‌యం సాధించింది. మార్నస్ ల‌బుషేన్ (28), ఓపెన‌ర్ ట్రెవిస్ హెడ్ (49) ధ‌నాధ‌న్ ఆడి మ్యాచ్ ముగించారు. 11 వికెట్లు తీసిన నాథ‌న్ లియాన్ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ విజ‌యంతో, నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ బోణీ కొట్టింది. భార‌త్ 2-1తో ఆధిక్యంలో ఉంది. అహ్మదాబాద్ స్టేడియంలో మార్చి 9న‌ నాలుగో టెస్టు జ‌ర‌గ‌నుంది.

చదవండి: 'ఇండోర్‌ పిచ్‌ అత్యంత నాసిరకం'

మరిన్ని వార్తలు