T20 World Cup: రంగంలోకి ఇమ్రాన్‌.. వాళ్లను తప్పించే అవకాశం.. షోయబ్‌, ఫఖార్‌ జమాన్‌కు..

28 Sep, 2021 13:06 IST|Sakshi

PM Imran Khan On T20 World Cup Squad: వచ్చే నెలలో ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్‌నకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ప్రకటించిన జట్టుపై అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయి. షోయబ్‌ మాలిక్‌, సర్ఫరాజ్‌ వంటి సీనియర్లకు చోటు దక్కకపోవడం.. ఫఖర్‌ జమాన్‌, ఉస్మాన్‌ ఖాదిర్, షెహనవాజ్‌ దహానిలను రిజర్వ్‌ ఆటగాళ్లుగా ప్రకటించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కాగా 15 మంది సభ్యులతో కూడిన టీ20 వరల్డ్‌కప్‌ జట్టు ప్రకటించగానే హెడ్‌కోచ్‌ మిస్బా ఉల్‌ హక్‌, వకార్‌ యూనిస్‌ తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 

కెప్టెన్‌ బాబర్‌ ఆజం సైతం జట్టు పట్ల సంతోషంగా లేడనే వార్తలు వినిపించగా.. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అలాంటివేమీ లేదని కొట్టిపడేసింది. అయితే మాజీ ఆటగాళ్లు మాత్రం పీసీబీ తీరుపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కనీసం రెండు, మూడు మార్పులతో బరిలో దిగితేనే సత్ఫలితాలు వస్తాయంటున్నారు. రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌, మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ ఆఫ్రిది ఇప్పటికే... జట్టు ఎంపికపై పెదవి విరిచారు. 

అప్పటివరకు అవకాశం.. కానీ
అక్టోబరు 10 వరకు జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో... ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా.. న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ అకస్మాత్తుగా పాకిస్తాన్‌ పర్యటన రద్దు చేసుకున్న నేపథ్యంలో.. ఐసీసీ ఈవెంట్‌లో ఆ జట్లపై ఆటతో ప్రతీకారం తీర్చుకోవాలంటే మార్పులు తప్పనిసరి అని చెబుతున్నారు. 

రమీజ్‌.. మరోసారి ఆలోచించు!
ఈ నేపథ్యంలో పాక్‌ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ ఖాన్‌ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పీసీబీ నూతన చైర్మన్‌ రమీజ్‌ రాజాతో ఈ విషయం గురించి చర్చించిన ఇమ్రాన్‌.. స్క్వాడ్‌ను పునః పరిశీలించాల్సిందిగా కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆజం ఖాన్‌, మహ్మద్‌ హస్నైన్‌, ఖుష్దిల్‌ షా, మహ్మద్‌ నవాజ్‌ను జట్టు నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయంటూ స్థానిక మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. వీరి స్థానంలో ఫఖార్‌ జమాన్‌, షర్జీల్‌ ఖాన్‌, షోయబ్‌ మాలిక్‌, షెహనవాజ్‌ దహానీ, ఉస్మాన్‌ ఖాదిర్‌లను ఎంపిక చేసే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా కివీస్‌, ఇంగ్లండ్‌ టూర్లు రద్దు చేసుకున్న నేపథ్యంలో పాక్‌ ఆటగాళ్లంతా నేషనల్‌ టీ20 కప్‌ ఆడటంలో బిజీగా ఉన్నారు. ఇక ఈ టోర్నీలో మహ్మద్‌ హస్నైన్‌ అంచనాలు అందుకోలేకపోతున్నాడు. అదే సయంలో పాకిస్తాన్‌ సూపర్‌లీగ్‌లో ఆకట్టుకున్న దహానీ... ఈ టోర్నీలోనూ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో నేషనల్‌ టీ20 కప్‌లో ప్రదర్శన ఆధారంగా టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. కాగా అక్టోబరు 24న దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో పాకిస్తాన్‌.. టీమిండియాతో మ్యాచ్‌ ఆడనుంది.

15 మందితో పాకిస్తాన్‌ టీ20 ప్రాబబుల్స్‌:
బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్(వైస్‌ కెప్టెన్‌), మహ్మద్ హఫీజ్, ఆసిఫ్ అలీ, అజమ్ ఖాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఖుష్దీల్ షా, మొహమ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మొహమ్మద్ వసీం, షాహిన్ అఫ్రిది, సోహైబ్ మక్సూద్.

రిజర్వ్‌ ప్లేయర్లు: ఫఖర్‌ జమాన్‌, ఉస్మాన్‌ ఖాదిర్, షెహనవాజ్‌ దహాని

మరిన్ని వార్తలు