రిటైర్మెంట్‌ ప్రకటించిన కోహ్లి ఫ్రెండ్‌

12 Feb, 2024 19:09 IST|Sakshi

జార్ఖండ్‌ ఆటగాడు, టీమిండియా క్రికెటర్‌ సౌరభ్‌ తివారి ప్రొఫెషనల్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 34 ఏళ్ల తివారి తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని జంషెడ్‌పూర్‌లో ఇవాళ (ఫిబ్రవరి 12) ప్రకటించాడు. ప్రస్తుత రంజీ సీజన్‌లో తన జట్టు ప్రస్తానం ముగిసిన అనంతరం తివారి తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెల్లడించాడు.

దాదాపు 17 ఏళ్ల పాటు జార్ఖండ్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన తివారి.. టీమిండియా తరఫున, ఐపీఎల్‌లో పలు మ్యాచ్‌లు ఆడాడు. భారత్‌ తరఫున 3 వన్డేలు ఆడిన తివారి.. ఐపీఎల్‌లో నాలుగు ఫ్రాంచైజీల తరఫున 93 మ్యాచ్‌లు ఆడాడు. తివారికి హార్డ్‌ హిట్టర్‌గా పేరుంది. అతని ఆహార్యం, హెయిర్‌ స్టయిల్‌ చూసి అప్పట్లో అందరూ మరో ధోని అనే వారు.

2010 ఐపీఎల్‌ సీజన్‌లో తివారి ముంబై ఇండియన్స్‌ తరఫున మెరుపులు మెరిపించాడు. ఆ సీజన్‌లో అతను 419 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన కారణంగానే తివారికి టీమిండియాలో ఛాన్స్‌ దక్కింది. భారత్‌ తరఫున అతను ఆడిన 3 మ్యాచ్‌ల్లో 49 పరుగులు చేవాడు. అంతర్జాతీయ స్థాయి తివారి రాణించలేకపోయినా, దేశావాలీ క్రికెట్‌లో స్టార్‌గా పేరుంది.

అతను జార్ఖండ్‌ తరఫున 115 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల్లో 22 సెంచరీల సాయంతో 8030 పరుగులు చేశాడు. ఈ గణంకాలు అదే జార్ఖండ్‌కు ప్రాతినిథ్యం వహించిన టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని కంటే ఎక్కువ కావడం విశేషం. తివారి కోహ్లి నేతృత్వంలోని అండర్‌-19 ప్రపంచకప్‌ (2008) గెలిచిన భారత యువ జట్టులో సభ్యుడు కావడం మరో విశేషం.

కోహ్లి చొరవతోనే తివారిని ఆర్సీబీ 2011 సీజన్‌ కోసం భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకుంది. జాతీయ జట్టుకు కాని, ఐపీఎల్‌లో కాని ఆడనప్పుడు క్రికెట్‌లో కొనసాగడం వేస్ట్‌ అని రిటైర్మెంట్‌ నిర్ణయం ప్రకటించే సందర్భంగా తివారి అన్నాడు. 
 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega