Video: మిస్‌ యూ పంత్‌! త్వరగా కోలుకో.. వచ్చెయ్‌ బడ్డీ.. కలిసి ఆడుదాం!

3 Jan, 2023 14:10 IST|Sakshi
రాహుల్‌ ద్రవిడ్‌తో పంత్‌

Team India- Rishabh Pant- Video: కారు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న యువ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌కు టీమిండియా అండగా నిలిచింది. పంత్‌ను యోధుడిగా అభివర్ణించిన భారత క్రికెటర్లు.. అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తొందర్లోనే తిరిగి మైదానంలో అడుగుపెడితే.. అంతా కలిసి మళ్లీ పాత రోజుల్లా ఆటను ఆస్వాదిద్దామంటూ పంత్‌కు సందేశం పంపారు.

కాగా బంగ్లాదేశ్‌ టెస్టు సిరీస్‌ తర్వాత స్వదేశానికి వచ్చిన 25 ఏళ్ల ఉత్తరాఖండ్‌ వికెట్‌ కీపర్‌ పంత్‌.. ఢిల్లీ నుంచి స్వస్థలానికి వెళ్లే సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతడు ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో గాయాలపాలయ్యాడు. ఈ దుర్ఘటనలో కారు మొత్తం కాలిపోగా.. అదృష్టవశాత్తూ పంత్‌ ప్రాణాలతో బయటపడ్డాడు.

త్వరగా కోలుకో..
భారత జట్టులో కీలక సభ్యుడైన పంత్‌ ప్రమాదానికి గురైన నేపథ్యంలో క్రీడా వర్గాలు సహా అభిమాన గణమంతా అతడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇక శ్రీలంకతో టీ20 సిరీస్‌ ఆరంభం కానున్న తరుణంలో టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సహా తాత్కాలిక కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, వైస్‌ కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తదితరులు అతడికి వీడియో మెసేజ్‌ పంపారు.

నువ్వు యోధుడివి.. తిరిగి వస్తావు
ద్రవిడ్‌ మాట్లాడుతూ.. ‘‘హేయ్‌ రిషభ్‌. త్వరగా కోలుకో. టెస్టు క్రికెట్‌లో గతేడాది కాలంగా జట్టుకు అవసరమైన సమయంలో నువ్వు ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌ దగ్గరగా చూసినందుకు సంతోషిస్తున్నా. కఠిన పరిస్థితుల్లో పట్టుదలగా నిలబడి పోరాడటం నీకు అలవాటే కదా!

ఇది కూడా అలాంటి ఓ సవాలే అనుకో. నాకు తెలుసు నువ్వు త్వరలోనే తిరిగి వస్తావు. నిన్ను మళ్లీ జట్టులో చూడాలని ఉంది బడ్డీ’’ అంటూ పంత్‌కు విష్‌ చేశాడు. హార్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ సహా ఇషాన్‌ కిషన్‌, శుబ్‌మన్‌ గిల్‌, యజ్వేంద్ర చహల్‌ తదితరులు.. ‘‘పంత్‌.. త్వరగా కోలుకో. తిరిగి వచ్చేయ్‌. మళ్లీ అంతా కలిసి ఆడుదాం! నువ్వు ఫైటర్‌వి. తొందరగా వస్తావు మాకు తెలుసు’’ అంటూ చీర్‌ చేశారు. కాగా లంకతో స్వదేశంలో సిరీస్‌కు పంత్‌ ఎంపిక కాలేదన్న విషయం తెలిసిందే.

చదవండి: Jaydev Unadkat: టీమిండియా ప్లేయర్‌ సంచలనం.. .. రంజీ చరిత్రలోనే తొలి బౌలర్‌గా
Ind Vs SL: రుతురాజ్‌, ఉమ్రాన్‌కు నో ఛాన్స్‌.. గిల్‌ అరంగేట్రం!

మరిన్ని వార్తలు