తేజస్విన్‌ పేరును పరిశీలించండి

23 Jun, 2022 05:51 IST|Sakshi

భారత అథ్లెటిక్స్‌ సెలక్షన్‌ కమిటీకి

హైకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: కామన్వెల్త్‌ గేమ్స్‌ కోసం ఎంపికల రగడ కోర్టుల చుట్టూనే తిరుగుతుంది. టేబుల్‌ టెన్నిస్‌లో అయితే భారత జట్టులో చోటు కోసం వరుసబెట్టి క్రీడాకారులు హైకోర్టు తలుపు తట్టారు. తాజాగా పురుష అథ్లెట్‌ తేజస్విన్‌ శంకర్‌ కూడా ఎంపిక విషయమై కోర్టు మెట్లెక్కాడు. అతని పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు సెలక్షన్‌ కమిటీ ఆ హై జంపర్‌ మెరిట్స్‌ను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ)ను ఆదేశించింది. తేజస్విన్‌ శంకర్‌ హైజంప్‌లో జాతీయ రికార్డు (2.29 మీటర్లు) సాధించాడు.

అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న అతను ఇటీవల అక్కడే జరిగిన నేషనల్‌ కాలేజియట్‌ అథ్లెటిక్‌ అసోసియేషన్‌ (ఎన్‌సీఏఏ) ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ చాంపియన్‌ షిప్‌లో 2.27 మీటర్ల దూరం ఎత్తుకు ఎగిరి బంగారు పతకం గెలిచాడు. ఏఎఫ్‌ఐ అర్హత మార్క్‌ కూడా 2.27 మీటర్లే! అయితే ఏఎఫ్‌ఐ అమెరికా పోటీల విషయమై శంకర్‌ తమను సంప్రదించలేదనే అహంతో... అంతరాష్ట్ర పోటీల్లో పాల్గొనలేదన్న కారణంతో బర్మింగ్‌హామ్‌ ఈవెంట్‌కు ఎంపిక చేయలేదు. దీనిపై విచారించిన జస్టిస్‌ జస్మిత్‌ సింగ్‌ ఇలాంటి అహం, భేషజాలను పక్కనబెట్టి అతని ప్రతిభను గుర్తించి కామన్వెల్త్‌ గేమ్స్‌కు ఎంపిక చేయాలని కేంద్ర క్రీడాశాఖ, ఏఎఫ్‌ఐకు నోటీసులు జారీ చేసింది.  

మరిన్ని వార్తలు