India Test Captain: రోహిత్‌ శర్మపై టీమిండియా మాజీ సెలక్టర్‌ సంచలన వ్యాఖ్యలు... సిరీస్‌కు ముందు గాయపడే కెప్టెన్‌ అవసరమా?

29 Jan, 2022 11:33 IST|Sakshi

Test Captaincy- Cannot Have Captain Who Gets Injured Start Of Series: టీమిండియా టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్‌ కోహ్లి వైదొలిగిన తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడు ఎవరా అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పరిమిత ఓవర్ల కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పేరు దాదాపు ఖాయమైపోగా... భారత మాజీ క్రికెటర్లు కొందరు ఈ నిర్ణయం సరైంది కాదని అభిప్రాయపడతున్నారు. వయసు, ఫిట్‌నెస్‌ దృష్ట్యా హిట్‌మ్యాన్‌ సరైన ఆప్షన్‌ కాదేమోనని పేర్కొంటున్నారు. టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌, మాజీ సెలక్టర్‌ సబా కరీం కూడా ఇదే మాట అంటున్నారు. ఓ యూట్యూట్‌ చానెల్‌తో మాట్లాడిన ఆయన.. టీమిండియా టెస్టు కెప్టెన్సీ అంశం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

మూడు ఫార్మాట్లకు అందుబాటులో ఉంటాడా?
‘‘రోహిత్‌ శర్మ తన అద్భుత ప్రదర్శనతో ఎంతో పేరు సంపాదించాడు. తను జట్టుకు ప్రధాన బలం. అయితే తన ముందున్న అసలైన సవాల్‌ ఏమిటంటే.. ఫిట్‌నెస్‌. అవును... అతడు ఫిట్‌గా ఉంటాడో లేదో తెలియదు. కెప్టెన్సీ విషయం పక్కనపెడితే.. అసలు రోహిత్‌కు మూడు ఫార్మాట్లకు అందుబాటులో ఉండటమే అతి పెద్ద టాస్క్‌. ఇప్పటికే ఎన్నోసార్లు గాయపడ్డాడు.

ఇప్పుడిప్పుడే రిహాబిలిటేషన్‌ సెంటర్‌ నుంచి తిరిగి వస్తున్నాడు. ఒకవేళ టెస్టు కెప్టెన్‌గా అతడిని నియమించాలని అనుకుంటే ముందుగా... ఫిట్‌నెస్‌ కోచ్‌, ఫిజియోతో చర్చించాలి. టెస్టు సిరీస్‌కు ముందు తరచుగా గాయపడే ఆటగాడిని సారథిని చేయడం సరికాదు కదా’’ అని పేర్కొన్నారు. ఇక రోహిత్‌ శర్మను వన్డే, టీ20, టెస్టు ఫార్మాట్లకు కెప్టెన్‌ చేసినా.. అది స్వల్పకాలానికి పరిమితమవుతుందని సబా కరీం అభిప్రాయపడ్డారు.

‘‘2023 టీమిండియాకు అత్యంత ముఖ్యమైనది. వన్డే వరల్డ్‌కప్‌ ఆడాల్సి ఉంది. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ సైకిల్‌ కూడా ఇదే ఏడాది ముగుస్తుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌ ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. రోహిత్‌ను అన్ని ఫార్మాట్లకు సారథిని చేసినా.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సరైన నాయకుడిని ఎంపిక చేయాలి. ప్రస్తుతానికి రోహిత్‌ ఒక్కడే ఆప్షన్‌. ఎందుకంటే.. కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌ వంటి ఆటగాళ్లు ఇంకా పరిణతి చెందాల్సి ఉంది. వాళ్లను నాయకులుగా తీర్చిదిద్దడానికి కాస్త సమయం పడుతుంది’’ అని సబా కరీం చెప్పుకొచ్చారు.

కాగా దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు రోహిత్‌ శర్మను వన్డే కెప్టెన్‌గా, టెస్టు వైస్‌ కెప్టెన్‌గా బీసీసీఐ ప్రమోట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే, టూర్‌ ఆరంభానికి ముందే అతడు గాయపడ్డాడు. ఈ క్రమంలో టెస్టు సిరీస్‌ ఓటమి తర్వాత కోహ్లి సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం, రోహిత్‌ గైర్హాజరీలో కేఎల్‌ రాహుల్‌ నేతృత్వం వహించిన వన్డే సిరీస్‌లో టీమిండియా వైట్‌వాష్‌కు గురికావడం వంటి పరిణామాలు జరిగాయి. ఇక ఇప్పుడు స్వదేశంలో వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ నేపథ్యంలో రోహిత్‌ ఫిట్‌నెస్‌ అంశం, కెప్టెన్సీ మరోసారి చర్చనీయాంశమయ్యాయి.  

చదవండి: IND vs WI: అత‌డు వ‌చ్చేశాడు.. టీమిండియాకు ఇక తిరుగు లేదు: పాక్‌ మాజీ కెప్టెన్‌

మరిన్ని వార్తలు