T20 WC Ind vs Pak: పాక్‌ గెలుపు సంబురాలు చేసుకున్న వారిపై దేశద్రోహం కేసులు..

29 Oct, 2021 12:23 IST|Sakshi

Those Celebrating Pakistan Win To Face Sedition Charges: టీ20 ప్రపంచకప్‌-2021లో భారత్‌పై పాక్‌ గెలుపొందిన అనంతరం సంబురాలు చేసుకున్న వారిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యారు. అలా చేసిన వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు. సీఎం ఆదేశాలతో యూపీ పోలీసులు ఇప్పటికే ఆగ్రా, బరేలీ, బదావున్‌, సీతాపూర్‌ జిల్లాల్లో ఏడుగురిపై కేసులు నమోదు చేశారు.

వీరిలో నలుగురు పాక్‌ అనుకూల నినాదాలు చేశారని రుజువు కావడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై ఐపీసీ సెక్షన్‌ 504/506, ఐటీ చట్టంలోని 66(ఎఫ్‌) సహా ఇతర సెక్షన్లు కింద కేసులు నమోదు చేశారు. కాగా, టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్‌ 24న దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియాపై పాక్‌ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో భారత్‌ తొలిసారి పాక్‌ చేతిలో ఓటమిని చవిచూడడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీమిండియా అభిమానులు నిరాశకు గురయ్యారు.

అయితే, భారత్‌లో ఉంటున్న కొందరు మాత్రం పాక్‌ విజయాన్ని వేడుక చేసుకున్నారు. బాణసంచా కాల్చుతూ.. పాక్‌ అనుకూల నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలోనే యూపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే, రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ జిల్లాకు చెందిన నఫీసా అనే ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌ పాక్‌ గెలుపును సెలబ్రేట్‌ చేసుకుంటూ వాట్సాప్‌లో స్టేటస్‌ పెట్టింది. ఇందుకు ఆమెను సస్పెండ్‌ చేయడంతో పాటు అక్కడి పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. 
చదవండి: టీమిండియాపై పాక్‌ గెలుపు.. సంబురాలు చేసుకున్న టీచర్‌ తొలగింపు

మరిన్ని వార్తలు