మంత్రి వర్గంలో సంస్కార హీనులు

29 Oct, 2021 04:39 IST|Sakshi

చందమామను చూసి కుక్కలు మొరిగినట్లు మంత్రి మొరుగుతుండు 

ఈ కుక్కకు కవిత ఏమవుతుందో ప్రజలు అడగాలి  

రంగారెడ్డి జిల్లాలో తొమ్మిదో రోజు కొనసాగిన షర్మిల పాదయాత్ర 

ఇబ్రహీంపట్నం: ‘తెలంగాణ మంత్రివర్గంలో సంస్కారం లేని వ్యక్తులు ఉన్నారు. చందమామను చూసి కుక్కలు మొరిగినట్లు మంత్రులు మొరుగుతున్నారు’అని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల విమర్శించారు. మంత్రి నిరంజన్‌రెడ్డి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్‌ కుమార్తె కవితను కూడా ఇలాగే హేళన చేస్తారా అని ప్రశ్నించారు. ఈ కుక్కకు కేసీఆర్‌ బిడ్డ కవిత ఏమవుతుందో ప్రజలు అడగాలని కోరారు.

ఆయనకు భార్య బిడ్డలు, తల్లి, చెల్లి లేరా..? అంటూ నిలదీశారు.  ఈ కుక్కలను తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. తెలంగాణలో వైఎస్సార్‌ సంక్షేమ పాలనే ధ్యేయంగా ఈ నెల 20న చేవెళ్ల నుంచి వైఎస్‌ షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో ప్రారంభించిన పాదయాత్ర గురువారం ఎలిమినేడు, కప్పపహాడ్, తుర్కగూడ, చెర్లపటేల్‌గూడ మీదుగా ఇబ్రహీంపట్నానికి చేరుకుంది. 9 రోజుల్లో వంద కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్న సందర్భంగా తల్లి విజయమ్మతో కలసి వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 

కేసీఆర్‌ పాలనకు చరమగీతం 
కేసీఆర్‌ నియంత పాలనకు చరమగీతం పాడాలని, రాజన్న రాజ్యం కోసం పోరాడాలని షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు. పాదయాత్రలో భాగంగా గురువారం ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఫార్మాసిటీ పేరుతో ప్రభుత్వ భూములే కాకుండా పట్టా, అసైన్డ్‌ భూములను రైతుల నుంచి లాక్కున్న ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానికే దక్కిందని విమర్శించారు. అమ్మకు అన్నం పెట్టని వాడు.. పిన్నమ్మకు బంగారు గాజులు ఇస్తామన్నట్లు స్థానిక ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తీరు ఉందని విమర్శించారు.

ఆయన స్వగ్రామమైన ఎల్మినేడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుందని చెప్పారు. రాష్ట్రంలో సమస్యలు లేకుంటే ముక్కు నేలకు రాసి ఇంటికి వెళ్లిపోతానంటూ çషర్మిల సవాల్‌ విసిరారు. సమస్యలుంటే సీఎం పదవికి రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్‌ నీలం రమేశ్, కొండా రాఘవరెడ్డి, పి.రాంరెడ్డి, ఏనుగు సునీల్‌కుమార్, అమృతసాగర్, మాదగోని జంగయ్యగౌడ్, ముస్తాఫాలు పాల్గొన్నారు. 

షర్మిల మాటకు ప్రాణమిచ్చే మనిషి  
మాటకు కట్టుబడే మనిషి షర్మిల అని, ఆమె సంకల్పబలం చాలా గొప్పది అని దివంగత వైఎస్సార్‌ సతీమణి వైఎస్‌ విజయమ్మ అన్నారు. ప్రజలతో మమేకమైతేనే సమస్యలు తెలుస్తాయని..అందుకు ఎంతో ముఖ్యమైన సాధనం పాదయాత్రని, వైఎస్సార్‌ కూడా ఇదే అంశాన్ని చెప్పే వారని గుర్తు చేశారు. అయన బాటలో షర్మిల పాదయాత్ర చేపట్టి ప్రజల కష్టసుఖాల్లో పాలపంచుకుంటుందని చెప్పారు. ఆమెను ఆశీర్వదించాలని విజయమ్మ కోరారు.

మరిన్ని వార్తలు