క్రికెట్‌లో కొత్త కెరటం.. మన హైదరాబాదీ! ఎవరో తెలుసా?

3 Sep, 2023 12:37 IST|Sakshi

ఐపీఎల్‌ 2022...ఈ మెగా టోర్నీలో ఐదుసార్లు చాంపియన్‌ అయిన ముంబై ఇండియన్స్‌కు జట్టుగా ఏదీ కలసి రాలేదు. పేలవమైన ప్రదర్శనతో లీగ్‌ దశలో అట్టడుగున పదోస్థానంతో ఆ జట్టు సరిపెట్టుకుంది. అయితే ఇలాంటి సమయంలోనూ ఆ సీజన్‌లో ముంబైకి చెప్పుకోదగ్గ  ఒకే ఒక సానుకూలాంశం ఒక కొత్త కుర్రాడి ప్రదర్శన. 397 పరుగులతో టీమ్‌లో రెండో అత్యధిక స్కోరర్‌గా నిలిచిన అతను తన ఆటతో, దూకుడుతో అందరినీ ఆకట్టుకున్నాడు.

ఆ ఆణిముత్యం పేరే ఠాకూర్‌ తిలక్‌వర్మ. అలా అలవోకగా సిక్సర్లు కొట్టే అతని శైలిపై ముంబై మేనేజ్‌మెంట్‌ ఉంచిన నమ్మకాన్ని అతను నిలబెట్టుకున్నాడు. తర్వాతి  సీజన్‌లోనూ అదే జోరు కొనసాగించి తన సత్తాను నిరూపించుకున్నాడు. ఏడాది తిరిగేలోగానే భారత జట్టులోనూ చోటు దక్కించుకున్న హైదరాబాద్‌ క్రికెటర్‌ తిలక్‌వర్మ వేగంగా దూసుకుపోతూ భవిష్యత్‌ తారగా ఇప్పుడు అందరి దృష్టిలోనూ నిలిచాడు. 

5 జులై, 2023... క్రికెట్‌ కోచ్‌ సలామ్‌ బాయేష్‌ తన అకాడమీలో పని పూర్తి చేసుకొని ఇంటికి వెళుతున్నాడు. ఆ సమయంలో అతని ఫోన్‌ మోగింది. తన ప్రియ శిష్యుడు తిలక్‌వర్మ చేసిన వీడియో కాల్‌ అది. అతను ఆ సమయంలో బెంగళూరులో దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌ ఆడుతున్నాడు. సర్, సర్‌ అంటూ తిలక్‌ తడబడుతూ మాట్లాడుతుండటంతో అంతా క్షేమమేనా అన్నట్లుగా సలామ్‌ ప్రశ్నించాడు.

నేను వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లే భారత జట్టులోకి ఎంపికయ్యాను అంటూ తిలక్‌ చెప్పాడు. దాంతో సలామ్‌ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. ఆనందబాష్పాలతో తిలక్‌కు అభినందనలు చెప్పి అంతకు మించి ఏమీ మాట్లాడలేనన్నట్లుగా సంభాషణ ముగించాడు. దాదాపు పుష్కరకాలం తన శిక్షణలో రోజురోజుకూ రాటుదేలుతూ వచ్చిన కుర్రాడు ఈ రోజు భారత జట్టు తరఫు ఆడే స్థాయికి చేరాడంటే ఏ కోచ్‌కైనా అంతకు మించిన ఆనందం ఏముంటుంది!

తన సహజ ప్రతిభతో పాటు పట్టుదల, పోరాటతత్వం, ఉత్తమ శిక్షణతో ఇంతింతై వటుడింతై అన్నట్లుగా తిలక్‌ చకచకా ఎదిగిపోయాడు. స్కూల్‌ క్రికెట్‌ స్థాయి నుంచి ఇప్పుడు టీమిండియా వరకు అతను అన్ని దశల్లోనూ తన ఆటనే నమ్ముకున్నాడు. మరో చర్చకు తావు లేకుండా తన ప్రదర్శనతోనే ఎదుగుతూ వచ్చాడు. 


నాతో వస్తావా.. కోచింగ్‌ ఇస్తా..
క్రికెటర్‌గా తిలక్‌ వర్మ ఆరంభం, ఆపై ప్రస్థానం ఆసక్తికరం. సాధారణ మధ్యతరగతి కుటుంబ నేపథ్యం ఉన్న అతను మొదట్లో కోచింగ్‌ కూడా తీసుకునే ఆలోచనతో లేడు. హైదరాబాద్‌ నగర శివార్లలో పాతబస్తీ బార్కాస్‌లో పదేళ్ల తిలక్‌ టెన్నిస్‌ బాల్‌తో క్రికెట్‌ ఆడటాన్ని కోచ్‌ సలామ్‌ గుర్తించాడు. సాధారణ టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ అంటే ఆటగాళ్లంతా బలంగా బంతిని బాదడానికే ప్రయత్నిస్తారు.

ప్రతి బంతినీ షాట్‌ కొట్టడంపైనే దృష్టి పెడతారు. కానీ అలాంటి చోట కూడా తిలక్‌  డ్రైవ్‌ తరహా సాంకేతికపరమైన షాట్లు ఆడే ప్రయత్నం చేయడమే సలామ్‌ను ఆకర్షించింది. శిక్షణతో అతను మెరుగవుతాడని భావించి అబ్బాయితో మాట్లాడగా, కోచింగ్‌ అంటే ఆర్థికభారం అంటూ అతను నాకు ఇదే చాలు అన్నట్లుగా జవాబిచ్చాడు. అయితే తిలక్‌ తల్లిదండ్రులతో మాట్లాడిన సలామ్‌.. అన్నీ నేను చూసుకుంటాను అని ఒప్పించడంతో శిక్షణ మొదలైంది. అయితే ఇది కాస్తా కఠినంగా మారింది. 

ఎక్కడో 20 కిలోమీటర్ల దూరంలో లింగంపల్లిలో ఉండే తన కోచింగ్‌ అకాడమీకి తిలక్‌ను తనతో పాటే తీసుకెళ్లి కోచింగ్‌ ఇవ్వడం, మళ్లీ ఇక్కడకు తీసుకురావడం కోచ్‌ చేస్తూ వచ్చాడు కోచ్‌. అయితే ఏడాది తర్వాత చూస్తే ఇది సరైందని కాదని, కుర్రాడి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోందని అర్థమైంది. దాంతో తల్లిదండ్రులనే తన అకాడమీ దగ్గరకు ఇల్లు మారితే బాగుంటుందని సూచించిన సలామ్‌ వారిని ఒప్పించడంలో సఫలమయ్యాడు. ఇదే తిలక్‌ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఎక్కువ సమయం ప్రాక్టీస్‌ చేయడంతో పాటు ఎలాంటి ఇతర ఆలోచనలు లేకుండా పూర్తిగా ఆటపైనే దృష్టి పెట్టేందుకు ఇది ఉపయోగపడింది. 

స్కూల్‌ క్రికెట్‌ నుంచి ఎదిగి..
తిలక్‌ కెరీర్‌లో ఎదిగేందుకు తొలి అడుగులు స్కూల్‌ క్రికెట్‌లో పడ్డాయి. సలామ్‌ అప్పటికే ఒక స్కూల్‌లో కోచ్‌గా పని చేస్తున్నాడు. తిలక్‌ ప్రతిభ గురించి కోచ్‌ వివరంగా చెప్పడంతో క్రీసెంట్‌ హైస్కూల్‌ కరస్పాండెంట్‌ ఫహీమ్‌ తమ స్కూల్‌లో విద్యార్థిగా ప్రవేశం కల్పించడంతో పాటు జట్టు తరఫున ఆడే అవకాశం కూడా ఇచ్చాడు. దాంతో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) నిర్వహించే ఇంటర్‌ స్కూల్, అండర్‌–13 టోర్నీల్లో తన ఆటతో సత్తా చాటేందుకు అతనికి సరైన అవకాశం దక్కింది.

నిలకడైన ప్రదర్శనతో రాణిస్తూ తిలక్‌ మరో మాటకు తావు లేకుండా ఆ సమయంలో బెస్ట్‌ బ్యాటర్‌గా నిలిచాడు. ఇదే ప్రదర్శనతో అండర్‌–16 టోర్నీ విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీలో హైదరాబాద్‌ జట్టులో అవకాశం రావడం కీలక మలుపు. ఈ టోర్నీ ఒక సీజన్‌లో ఏకంగా 960 పరుగులు సాధించడంతో అతని ప్రతిభ అందరికీ తెలిసిపోయింది. ఆ తర్వాత వరుసగా ప్రధాన టోర్నీలు అన్నింటిలోనూ అవకాశాలు రావడం సహజ పరిణామంగా సాగిపోయింది. ఎక్కడ, ఏ స్థాయిలో ఆడినా పరుగుల వరద పారించడం తిలక్‌కు మంచినీళ్లప్రాయంగా మారిపోయింది.

సాధించిన పరుగులతో సంతృప్తి పడకుండా భారీ స్కోర్లుగా మలచడం అతను అలవాటుగా మార్చుకున్నాడు. ఈ క్రమంలో అతని దూకుడైన బ్యాటింగ్‌ శైలి క్రికెట్‌ వర్గాల్లో అందరికీ చేరువ చేసింది. హైదరాబాద్‌ అండర్‌–19 టీమ్, ఆపై భారత జట్టు తరఫున అండర్‌–19 వరల్డ్‌ కప్, సీనియర్‌ విభాగంలో ముస్తాక్‌ అలీ ట్రోఫీ, విజయ్‌ హజారే, రంజీ ట్రోఫీ...ఇలా వరుసగా అవకాశాలు రావడం, అన్నింటా చెలరేగడం సాధారణంగా మారిపోయింది. 

ఐపీఎల్‌లో అవకాశంతో..
చాలామంది వర్ధమాన క్రికెటర్లలాగే తిలక్‌ కూడా ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన వేర్వేరు ఐపీఎల్‌ మ్యాచ్‌లలో బాల్‌బాయ్‌గా వ్యవహరించాడు. స్కూల్‌ క్రికెట్‌లో ఎదుగుతున్న దశలో హైదరాబాద్‌ టీమ్‌ సన్‌రైజర్స్‌ ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలవడం కూడా అతను చూశాడు. దాంతో ఏదో ఒకరోజు తానూ ఐపీఎల్‌ ఆడాలని ఆశించాడు. అంతటితో ఆగిపోకుండా తనను తాను నమ్మి అందుకు తగినట్లుగా శ్రమించాడు.

క్రికెట్‌ ప్రాక్టీస్‌ మినహా మరే ఆలోచన లేకుండా కష్టపడ్డాడు. తిలక్‌ సాధించిన పరుగులు, అతని పదునైన ఆటతో నాటి కల నెరవేర్చుకునేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ముంబై ఇండియన్స్‌ ప్రతిభాన్వేషణ బృందం దృష్టిలో తిలక్‌ పడ్డాడు. దాని ఫలితమే 2022 ఐపీఎల్‌ వేలంలో అవకాశం. అప్పటి వరకు అతని అన్ని గణాంకాలను పరిశీలించిన ముంబై వేలంలో రూ. 1.70 కోట్లకు తిలక్‌ను ఎంచుకుంది.

ఆ రోజు తిలక్‌.. అతని తల్లిదండ్రులు నాగరాజు, గాయత్రిలతో పాటు కోచ్‌ సలామ్‌ ఆనందానికీ అవధుల్లేవు. ఇన్నేళ్ల శ్రమకు తగిన గుర్తింపు లభించిన క్షణం వారికి అపురూపంగా నిలిచింది. జట్టులోకి వచ్చినా ఆడే అవకాశంపై సందేహాలు. అయితే అవి పటాపంచలు అయ్యేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రోత్సాహంతో 14 లీగ్‌ మ్యాచ్‌లూ ఆడే అవకాశం దక్కింది.

సత్తా చాటడంతో తర్వాతి ఏడాది జట్టులో స్థానం గురించి ఆందోళన చెందాల్సిన అవసరమే లేకపోయింది. ఇక ఇటీవల వెస్టిండీస్‌తో తొలి టి20 సిరీస్‌లోనే అద్భుత ఆటతో తిలక్‌ చెలరేగడం భారత మాజీ కెప్టెన్లు, సీనియర్‌ క్రికెటర్ల ప్రశంసకు పాత్రమైంది. తిలక్‌ను వన్డే వరల్డ్‌ కప్‌ జట్టులోకీ తీసుకోవచ్చనే డిమాండ్లు మాజీ ఆటగాళ్ల నుంచి వచ్చాయంటే అతను తన ఆటతో ఎలాంటి ముద్ర వేశాడో అర్థమవుతుంది.

అందుకే ఒక్క అంతర్జాతీయ వన్డే ఆడకపోయినా నేరుగా ఆసియా కప్‌ జట్టులో అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. తాజా ప్రదర్శనతో వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచకప్‌లో చోటు ఖాయం కావడంతో పాటు మున్ముందు భారత క్రికెట్‌ను నడిపించగల భవిష్యత్‌ స్టార్ల జాబితాలోనూ అతని పేరు చేరింది. అరంగేట్రంతోనే అదరగొట్టిన ఈ హైదరాబాదీ కెరీర్‌లో మరింత దూసుకుపోయి శిఖరాన నిలవాలని ఆశిద్దాం.  

మరిన్ని వార్తలు