Tokyo Olympics: ఎన్నోఏళ్ల భారత్‌ కల.. రేపు నిజమయ్యే ఛాన్స్‌!

1 Aug, 2021 02:24 IST|Sakshi

మహిళల డిస్కస్‌ త్రో ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరిన భారత అథ్లెట్‌

మూడో ప్రయత్నంలోనే అర్హత మార్క్‌ను అందుకున్న పంజాబ్‌ అమ్మాయి

అంతా అనుకున్నట్లు జరిగితే... ఎన్నో ఏళ్లుగా ఒలింపిక్స్‌లో భారత్‌ను ఊరిస్తోన్న అథ్లెటిక్స్‌ పతకం సోమవారం నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మహిళల డిస్కస్‌ త్రో విభాగంలో భారత క్రీడాకారిణి కమల్‌ప్రీత్‌ కౌర్‌ ప్రదర్శన పతకంపై ఆశలు రేకెత్తిస్తోంది. తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న 25 ఏళ్ల ఈ పంజాబీ అమ్మాయి శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌లో మూడో ప్రయత్నంలో నేరుగా ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసే కనీస అర్హత మార్క్‌ను (64 మీటర్లు) అందుకుంది. అంతేకాకుండా ఫైనల్‌కు అర్హత పొందిన మొత్తం 12 మందిలో కమల్‌ప్రీత్‌ రెండో స్థానంలో నిలువడం విశేషం. భారత్‌కే చెందిన మరో డిస్కస్‌ త్రోయర్‌ సీమా పూనియా నాలుగోసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నప్పటికీ ఈసారి కూడా క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగి నిరాశపరిచింది.

టోక్యో: ఒలింపిక్స్‌లో శనివారం భారత అథ్లెట్స్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల డిస్కస్‌ త్రో ఈవెంట్‌లో కమల్‌ప్రీత్‌ కౌర్‌ ఫైనల్‌కు అర్హత సాధించగా... సీమా పూనియా క్వాలిఫయింగ్‌ను దాటలేకపోయింది. పురుషుల లాంగ్‌జంప్‌ క్వాలిఫయింగ్‌లో శ్రీశంకర్‌ ఓవరాల్‌గా 25వ స్థానంలో నిలిచాడు. క్వాలిఫయింగ్‌ గ్రూప్‌ ‘బి’లో పోటీపడిన కమల్‌ప్రీత్‌ మూడో ప్రయత్నంలో డిస్క్‌ను 64 మీటర్ల దూరం విసిరి తన గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచింది. తొలి ప్రయత్నంలో ఆమె డిస్క్‌ను 60.29 మీటర్లు... రెండో ప్రయత్నంలో 63.97 మీటర్ల దూరం విసిరింది. 16 పాల్గొన్న ఈ విభాగంలో వలారీ ఆల్‌మన్‌ (అమెరికా) 66.42 మీటర్లతో అగ్రస్థానాన్ని సంపాదించింది. 64 మీటర్ల దూరం విసిరితే నేరుగా ఫైనల్‌ బెర్త్‌ ఖరారవుతుంది.

15 మందితో కూడిన గ్రూప్‌ ‘ఎ’లో పోటీపడ్డ భారత మరో డిస్కస్‌ త్రోయర్‌ సీమా డిస్క్‌ను 60.57 మీటర్ల దూరం విసిరి ఆరో స్థానం లో నిలిచింది. మొత్తం రెండు గ్రూప్‌లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 12 మంది ఫైనల్‌కు అర్హత సాధించారు. ఓవరాల్‌గా సీమా 16వ స్థానం లో నిలిచి ఫైనల్‌ బెర్త్‌ దక్కించుకోలేకపోయింది. సోమవారం స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం ఫైనల్‌ జరుగుతుంది. క్వాలిఫయింగ్‌లో కమల్‌ ప్రీత్‌ ప్రదర్శన డిఫెండింగ్‌ చాంపియన్‌ సాండ్రా పెర్కోవిచ్‌ (క్రొయేషియా–63.75 మీటర్లు), వరల్డ్‌ చాంపియన్‌ వైమి పెరెజ్‌ (క్యూబా–63.18 మీటర్లు) కంటే  మెరుగ్గా ఉండటం విశేషం. దాంతో కమల్‌ప్రీత్‌ ఇదే ప్రదర్శనను ఫైనల్లోనూ పునరావృతం చేస్తే పతకం వచ్చే అవకాశముంది. ‘తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నందుకు కాస్త నెర్వస్‌గా ఫీలయ్యాను. అయితే తొలి త్రో వేశాక ఆత్మవిశ్వాసం పెరిగింది. ఫైనల్లో నా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి భారత్‌కు పతకం అందించమే నా ఏకైక లక్ష్యం’ అని వచ్చే ఏడాది అమెరికాలో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌కు కూడా అర్హత పొందిన కమల్‌ప్రీత్‌ వ్యాఖ్యానించింది.

పురుషుల లాంగ్‌జంప్‌లో భారత ప్లేయర్‌ శ్రీశంకర్‌ 7.69 మీటర్ల దూరం దూకి గ్రూప్‌ ‘బి’లో 13వ స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా 29 మంది పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో శ్రీశంకర్‌కు 25వ స్థానం దక్కింది. 

మరిన్ని వార్తలు