పంత్‌ ఊచకోతపై ప్రముఖుల ట్వీట్ల వర్షం.. 

5 Mar, 2021 21:36 IST|Sakshi

అహ్మదాబాద్‌: తనదైన రోజున ప్రత్యర్ధి బౌలర్ల పాలిట సింహస్వప్నంలా నిలిచే టీమిండియా డాషింగ్‌ వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌పై ట్విటర్‌ వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఫైటింగ్ సెంచ‌రీతో అదరగొట్టిన పంత్‌.. 116 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో టెస్టుల్లో మూడో సెంచ‌రీని నమోదు చేశాడు. రూట్‌ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి మ‌రీ సెంచ‌రీ పూర్తి చేసిన పంత్‌.. ఆ వెంటనే (101 పరుగుల వద్ద) అండర్సన్‌ బౌలింగలో ఔటయ్యాడు. క్లిష్ట సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన పంత్‌.. మొద‌ట్లో వికెట్ కాపాడుకునే ఉద్దేశంతో నెమ్మదిగా ఆడి హాఫ్ సెంచ‌రీని పూర్తి చేశాడు. 

ఆతరువాతే పంత్‌ విధ్వంసం మొదలైంది. ఇంగ్లండ్ కొత్త బంతిని తీసుకున్న త‌ర్వాత వ‌రుస ఫోర్లతో విరుచుకుప‌డ్డాడు. దీంతో టీమిండియా కీల‌క‌మైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. పంత్‌కు వాషింగ్టన్‌ సుంద‌ర్‌ నుంచి పూర్తి సహకారం లభించింది. సుందర్‌(117 బంతుల్లో 60 నాటౌట్‌, 8 ఫోర్లు), పంత్‌లు క‌లిసి ఏడో వికెట్‌కు 113 ప‌రుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాకు 89 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని అందించారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. కాగా, పంత్‌, సుందర్‌ల జోడీ ఇన్నింగ్స్‌ను నిర్మించిన తీరుపై ప్రముఖ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పంత్‌ దూకుడును, సుందర్‌ సంయమన్నాని వారు ఆకాశానికెత్తారు.

ఒత్తిడిలో నమ్మశక్యంకాని రీతితో బౌలర్లపై విరుచుకుపడి అద్భుతమైన శతకం సాధించిన టీమిండియా డాషింగ్‌ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌కు అభినందనలు. నీ విధ్వంసం మొదటిది కాదు.. అలాగని ఆఖరిది కూడా కాకూడదు.. భవిష్యత్తులో నీ బ్యాటింగ్‌ ఊచకోత కొనసాగించాలని ఆశిస్తున్నా.. అన్ని ఫార్మాట్లలో ఆల్‌ టైమ్‌ బెస్ట్‌ నువ్వే.. నువ్వు నిజమైన మ్యాచ్‌ విన్నర్‌ అంటూ టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ పంత్‌ను ఆకాశానికెత్తాడు.

జట్టుకు అవసరమైనప్పుడు అద్భుతమైన శతకాన్ని సాధించావు.. గతంలో గిల్‌క్రిస్ట్‌ చేసిన విధ్వంసాలను గుర్తు చేశావంటూ టీమిండియా మాజీ ఓపెనర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ ప్రశంసించారు.

యువ క్రికెటర్లు జట్టు బాధ్యతలను భుజానికెత్తుకోవడం సంతోషాన్ని కలిగిస్తోంది.. పంత్‌ ఊచకోత, సుందర్‌ నిలకడ ప్రదర్శనకు అభినందనలు.. సుందర్‌ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావు.. యువ క్రికెటర్లు భవిష్యత్తులో మరింత నిలకడగా ఆడాలని ఆశిస్తున్నా... వీవీఎస్‌ లక్ష్మణ్‌

ఆండర్సన్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌ చేసి ఫోర్‌ కొట్టడం, సిక్సర్‌తో శతకాన్ని చేరుకోవడం అత్యద్భుతం..నువ్వే నా నిజమైన వారసుడివి.. సెహ్వాగ్

అసాధారణ ప్రతిభ కలిగిన పంత్‌.. అసాధారణ శతకాన్ని పూర్తి చేశాడు.. అభినందనలు.. టామ్‌ మూడీ

మరిన్ని వార్తలు