U19 WC- Shaikh Rasheed: 40 లక్షల నగదు.. అంత డబ్బు ఎప్పుడూ చూడలేదు.. చిన్న ఇల్లు కొంటాను.. మిగతా మొత్తంతో..

7 Feb, 2022 10:01 IST|Sakshi

ఎంతో మధురం... ఈ విజయం

‘సాక్షి’తో షేక్‌ రషీద్‌

గుంటూరు స్పోర్ట్స్, సాక్షి: రికార్డుస్థాయిలో ఐదోసారి భారత జట్టు అండర్‌–19 ప్రపంచకప్‌ టైటిల్‌ సాధించడంలో ఆంధ్ర క్రికెటర్‌ షేక్‌ రషీద్‌ పాత్ర కూడా ఉంది. గుంటూరు జిల్లాకు చెందిన 17 ఏళ్ల రషీద్‌ జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ టోర్నీలో రషీద్‌ నాలుగు మ్యాచ్‌లు ఆడి 50.25 సగటుతో 201 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

కరోనా బారిన పడటంతో అతను రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. భారత జట్టు జగజ్జేతగా నిలిచాక వెస్టిండీస్‌లో ఉన్న షేక్‌ రషీద్‌తో ఫోన్‌లో ‘సాక్షి’ ముచ్చటించింది. ఈ సందర్భంగా రషీద్‌ మాట్లాడుతూ తన కెరీర్‌లో ఈ విజయం ఎంతో ప్రత్యేకమని, ఈ ఘనత చిరకాలం గుర్తుంటుందని వివరించాడు.  

ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నందుకు ఎలా అనిపిస్తోంది?  
ముందుగా నాకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. ఈ విజయం నా కెరీర్‌లో ఎంతో ప్రత్యేకం. ముఖ్యంగా సెమీస్‌లో ఆస్ట్రేలియాపై 94, ఫైనల్లో ఇంగ్లండ్‌పై 50 పరుగులు సాధించి జట్టు విజయంలో నా వంతు సహకారం అందించడం మరువలేనిది.  

బీసీసీఐ ప్రకటించిన నగదు పురస్కారంతో ఏం చేయబోతున్నారు? 
నేను మ్యాచ్‌లకు వెళ్ళే ప్రతిసారి నాకు ఆర్ధిక ఇబ్బందులుండేవి. డబ్బులు లేక నా కుటుంబం పడ్డ ఇబ్బందులు నాకు తెలుసు. అయితే  చాలా మంది నాకు  సహకారమందించారు. ఒక్కసారిగా ఇంత మొత్తం అందుతుందంటే నమ్మబుద్ది కావడంలేదు. వాస్తవానికి అంత డబ్బు నేను ఎప్పుడూ చూడలేదు. మాకు ఇప్పటి వరకు చిన్న ఇల్లు కూడా లేదు. కొంత డబ్బు వెచ్చించి మా కుటుంబ సభ్యులకు చిన్న ఇల్లు కొంటాను. మిగతా డబ్బును నా కెరీర్‌ కోసం ఖర్చు చేస్తాను.

స్టార్‌ ఇమేజ్‌ వచ్చిందనుకుంటున్నారా? 
ఎప్పటికీ అనుకోను. నా జీవితం ఎక్కడ నుంచి ప్రారంభమయ్యిందో నాకు బాగా తెలుసు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని నా కోచ్‌లు, కుటుంబ సభ్యుల నుంచి నేర్చుకున్నాను. భవిష్యత్‌లో భారత సీనియర్‌ జట్టులో స్థానం సంపాదించడమే ధ్యేయంగా కృషి చేస్తాను.  

ఔత్సాహిక క్రీడాకారులకు మీరిచ్చే సలహా? 
సలహాలిచ్చే స్థాయికి చేరుకోలేదు. అయితే కఠోర సాధనతోపాటు మనలోని లోపాలను నిత్యం అధిగమిస్తూ ఉండాలి. ప్రారంభంలో పేస్‌ బౌలింగ్‌ ఆడేందుకు ఇబ్బంది పడే వాడిని. దానిపై ఎక్కువ దృష్టి సారించి సాధన చేసాను. అందుకే ప్రపంచకప్‌లో రాణించాను.

చదవండి: IND VS WI 1st ODI: కోహ్లినా మజాకా.. పంత్‌ను కాదని మాజీ కెప్టెన్‌ సలహా కోరిన హిట్‌మ్యాన్‌ 

మరిన్ని వార్తలు