Uber Cup 2021: అమ్మాయిల ఆట ముగిసె...

15 Oct, 2021 08:13 IST|Sakshi

  క్వార్టర్స్‌లో జపాన్‌ చేతిలో ఓటమి 

చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో  పురుషుల జట్టు పరాజయం

థామస్‌–ఉబెర్‌ కప్‌ ఫైనల్స్‌ 

Uber Cup 2021: ఆర్‌హస్‌ (డెన్మార్క్‌): థామస్‌–ఉబెర్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ ఫైనల్స్‌ భారత జట్లు గురువారం కంగు తిన్నాయి. అయితే థామస్‌ కప్‌లో ఇదివరకే క్వార్టర్స్‌ చేరిన పురుషుల జట్టు ఆఖరి లీగ్‌లో చైనా చేతిలో ఓడిపోయింది. కానీ ఉబెర్‌ కప్‌లో మహిళల జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. క్వార్టర్‌ ఫైనల్లో భారత అమ్మాయిల జట్టుకు 0–3తో జపాన్‌ చేతిలో చుక్కెదురైంది.

వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమితో ఫలితం రావడంతో మిగతా రెండు మ్యాచ్‌లు నిర్వహించలేదు. తొలి సింగిల్స్‌లో మాళవిక బన్సోద్‌ 12–21, 17–21తో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ యామగుచి చేతిలో కంగుతింది. డబుల్స్‌లో తనీషా–రుతుపర్ణ పండా జోడీ 8–21, 10–21తో యూకి ఫుకుషిమా–మయు మత్సుమొటొ జంట చేతిలో ఓడింది. రెండో సింగిల్స్‌లో అదితి భట్‌ 16–21, 7–21తో సయాక టకహషి చేతిలో పరాజయం చవిచూసింది. 

చైనా చేతిలో చిత్తు... 
భారత పురుషుల జట్టు చివరి గ్రూప్‌ మ్యాచ్‌ను పరాజయంతో ముగించింది. పటిష్ట చైనా 4–1 తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. డబుల్స్‌లో మాత్రమే మన జోడీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌ శెట్టి ద్వయం 21–14, 21–14తో చైనాకు చెందిన హి జి టింగ్‌ – జూ హావో డోంగ్‌ జంటను ఓడించింది. మరో డబుల్స్‌ జంట ఎంపీ అర్జున్‌ – ధ్రువ్‌ కపిల 24–26, 19–21తో ల్యూ చెంగ్‌ – వాంగ్‌ యి ల్యూ చేతిలో పోరాడి ఓడారు.

మూడు సింగిల్స్‌ మ్యాచ్‌లలో భారత షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, సమీర్‌ వర్మ, కిరణ్‌ జార్జ్‌లకు పరాజయం తప్పలేదు. షి యు ఖి 21–12, 21–16తో శ్రీకాంత్‌పై, లూ గ్వాంగ్‌ జు 14–21, 21–9, 24–22తో సమీర్‌ వర్మపై, లి షి ఫెంగ్‌ 21–15, 21–17తో కిరణ్‌ జార్జ్‌పై గెలుపొందారు. టోర్నీలో భారత్‌కు ఇదే తొలి పరాజయం. నెదర్లాండ్స్, తహిటిలను 5–0 తేడాలతో ఓడించిన మన టీమ్, నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్‌ సమరంలో ఆతిథ్య డెన్మార్క్‌తో తలపడుతుంది.

చదవండి: MS Dhoni: హెలికాప్టర్‌ షాట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న ధోని.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు