FIFA World Cup 2022: ఖతర్‌ను పొగుడుతూ ట్వీట్‌.. రిషి సునాక్‌పై విమర్శలు!

6 Dec, 2022 14:20 IST|Sakshi

లండన్‌: ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో మ్యాచ్‌లు తుది అంకానికి చేరుకుంటున్నాయి. ఏమాత్రం అంచనాలు లేని జట్టు బలమైన జట్లను ఓడించాయి. ఇదిలా ఉంటే..ఫిఫా ప్రపంచకప్‌పై బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ చేసిన ఓ ట్వీట్‌ విమర్శలకు దారి తీసింది. 16వ రౌండ్‌లో సెనెగల్‌తో ఇంగ్లాండ్‌ మ్యాచ్‌కు ముందు ఫిఫా ప్రపంచకప్‌ను నిర్వహిస్తున్న ఖతర్‌ను పొగుడుతూ ట్వీట్‌ చేశారు రిషి సునాక్‌. ‘ఇప్పటివరకు అద్భుతమైన ప్రపంచకప్‌ను నిర్వహించినందుకు ఖతార్‌కు హ్యాట్సాఫ్. గ్రూప్ దశలు ఆల్ టైమ్ గ్రేట్స్‌లో ఒకటిగా గుర్తుండిపోతాయి. కమాన్‌ ఇంగ్లాండ్‌.. మన కలను సజీవంగా కొనసాగించండి.’ అంటూ ట్విట్టర్ వేదికగా ఖతార్‌పై ప్రశంసలు కురింపించారు. 

ఆయన ట్వీట్‌కు మిశ్రమ స్పందనలు వచ్చాయి. ‘నిజంగానా? ఆల్‌ టైమ్‌ గ్రేట్స్‌? మీరు ఏం చూస్తున్నారో మాకైతే అర్థం కావటం లేదు.’ అంటూ ఓ నెటిజన్‌ రాసుకొచ్చారు. మరోవైపు.. కొందరు ఇంగ్లాండ్‌, సెనెగల్‌ మధ్య థ్రిల్లింగ్‌ మ్యాచ్‌ జరిగినట్లు పేర్కొన్నారు. ‘ఎస్‌ రిషి సునాక్‌, ఖతర్‌ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కొంత మందికి మాత్రం సమస్యగా ఉన్నా.. చూడదగ్గ ఈవెంట్‌.’ అంటూ మరొకరు రాసుకొచ్చారు. మరోవైపు.. ఇంగ్లాండ్‌ గత మ్యాచ్‌లో విజయం సాధించటంపై ప్రశంసలు కురింపించారు. తాము గతంలో ఎన్నడూ ఇంగ్లాండ్‌ ఆటను ఈ విధంగా చూడలేదని పేర్కొన్నారు. సెనెగల్‌పై విజయం సాధించిన ఇంగ్లాండ్‌.. డిసెంబర్‌ 11 డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఫ్రాన్స్‌తో క్వార్టర్‌ ఫైనల్‌లో తలపడనుంది.

ఇదీ చదవండి: FIFA World Cup 2022: మరో సంచలనం.. బెల్జియంను ఖంగుతినిపించిన మొరాకో

మరిన్ని వార్తలు