టైమ్డ్‌ ఔట్‌ కాకుండా మరో విచిత్ర పద్దతిలో ఔట్‌.. అది కూడా ఈ ఏడాదిలోనే..!

7 Nov, 2023 13:57 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ టైమ్డ్‌ ఔట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలా ఔటైన ఆటగాడు మాథ్యూసే కావడం​ విశేషం. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలా ఎక్కువగా ప్రచారం లేని మరో విధానంలో ఓ బ్యాటర్‌ ఇదే ఏడాది ఔటయ్యాడు. మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) నిబంధనల ప్రకారం బ్యాటర్లు మొత్తం పది విధాలుగా ఔట్‌గా ప్రకటించబడతారు. 

వాటిలో క్యాచ్‌ ఔట్‌, బౌల్డ్‌, ఎల్బీడబ్ల్యూ, రనౌట్‌,స్టంపౌట్‌ అతి సాధారణంగా ప్రకటించబడే ఔట్‌లు కాగా.. హిట్‌ వికెట్‌ (బ్యాటర్‌ వికెట్లను తగలడం), హ్యాండిల్డ్‌ బాల్‌ (బంతిని పట్టుకోవడం లేదా ఆపడం), అబ్స్ట్రక్టెడ్‌ ఫీల్డ్‌ (ఉద్దేశపూర్వకంగా ఫీల్డింగ్‌కు అడ్డుతగలడం) వంటివి అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం.

అయితే పది విధానాల్లో మిగిలిన రెండు విధాల ఔట్‌లను మాత్రం క్రికెట్‌ ప్రపంచం ఈ ఏడాదికి ముందు చూసి ఎరుగదు. ఆ రెండు విధాల ఔట్‌లు ఏవంటే.. టైమ్డ్‌ ఔట్‌ (నిర్దేశిత సమయంలోపు బ్యాటింగ్‌కు దిగకపోవడం), హిట్‌ ట్వైస్‌ (బ్యాటర్‌ రెండుసార్లు బంతిని కొట్టడం). ఈ రెంటిలో టైమ్డ్‌ ఔట్‌ను నిన్నటి వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో తొలిసారిగా చూశాం. ఇందులో రెండోదైన హిట్‌ ట్వైస్‌ ఔట్‌ ఘటన కూడా ఇదే ఏడాది తొలిసారి జరిగిందన్న విషయం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. 

పురుషుల కాంటినెంటల్‌ కప్‌లో భాగంగా ఈ ఏడాది ఆగస్ట్‌ 20న రొమేనియాతో జరిగిన మ్యాచ్‌లో మాల్టా ఆటగాడు ఫన్యాన్‌ ముఘల్‌ ఓసారి బంతిని స్ట్రయిక్‌ చేసిన అనంతరం ఫీల్డర్‌ పట్టుకోకముందే మరోసారి బ్యాట్‌తో కొట్టి హిట్‌ ట్వైస్‌గా ఔటయ్యాడు. మాథ్యూస్‌ టైమ్డ్‌ ఔట్‌ విషయం వైరలైన నేపథ్యంలో హిట్‌ ట్వైస్‌కు సంబంధించిన వీడియో తెరపైకి వచ్చింది. ఈ వీడియో సైతం ప్రస్తుతం వైరలవుతుంది. 

ఏ ఆటగాడు, ఎప్పుడు తొలిసారి ఔట్‌గా ప్రకటించబడ్డాడంటే..

  1. క్యాచ్‌ ఔట్‌ (టామ్‌ హోరన్‌, 1877), 
  2. బౌల్డ్‌ (నాట్‌ థామ్సన్‌, 1877), 
  3. ఎల్బీడబ్ల్యూ (హ్యారీ జప్‌, 1877), 
  4. రనౌట్‌ (డేవ్‌ గ్రెగరీ, 1877),
  5. స్టంపౌట్‌ (ఆల్ఫ్రెడ్‌ షా, 1877),
  6. హిట్‌ వికెట్‌ (బ్యాటర్‌ వికెట్లను తగలడం, జార్జ్‌ బొన్నర్‌, 1884), 
  7. హ్యాండిల్డ్‌ బాల్‌ (బంతిని పట్టుకోవడం లేదా ఆపడం, రసెల్‌ ఎండీన్‌, 1957), 
  8. అబ్స్ట్రక్టెడ్‌ ఫీల్డ్‌ (ఉద్దేశపూర్వకంగా ఫీల్డింగ్‌కు అడ్డుతగలడం, లెన్‌ హటన్‌, 1951),
  9. హిట్‌ ట్వైస్‌ (బ్యాటర్‌ రెండుసార్లు బంతిని కొట్టడం, ఫన్యాన్‌ ముఘల్‌, 2023), 
  10. టైమ్డ్‌ ఔట్‌ (నిర్దేశిత సమయంలోపు బ్యాటింగ్‌కు దిగకపోవడం, ఏంజెలో మాథ్యూస్‌, 2023) 
మరిన్ని వార్తలు