మిస్టరీ స్పిన్నర్‌ మాయాజాలం.. 69 పరుగులకే కుప్పకూలిన ప్రత్యర్ధి

5 Dec, 2023 11:16 IST|Sakshi

విజయ్‌ హజారే ట్రోఫీ 2023లో తమిళనాడు బౌలర్‌, ఐపీఎల్‌ మిస్టరీ స్పిన్నర్‌ (కోల్‌కతా నైట్‌రైడర్స్‌) వరుణ్‌ చక్రవర్తి చెలరేగిపోయాడు. నాగాలాండ్‌తో ఇవాళ (డిసెంబర్‌ 5) జరుగుతున్న మ్యాచ్‌లో అతను ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. వరుణ్‌ స్పిన్‌ మాయాజాలం ధాటికి నాగాలాండ్‌ 19.4 ఓవర్లలో 69 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ఐదు ఓవర్లు వేసిన వరుణ్‌.. 3 మెయిడిన్లు వేసి కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.

ప్రస్తుత సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న వరుణ్‌.. ఇప్పటివరకు జరిగిన 6 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి టోర్నీ లీడింగ్‌ వికెట్‌టేకర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. వరుణ్‌తో పాటు రవిశ్రీనివాసన్‌ సాయి కిషోర్‌ (5.4-0-21-3), సందీప్‌ వారియర్‌ (6-1-21-1), టి నటరాజన్‌ (3-0-15-1) కూడా రాణించడంతో నాగాలాండ్‌ ఇన్నింగ్స్‌ పేకమేడలా కూలింది. ఆ జట్టులో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సుమిత్‌ కుమార్‌ 20, జాషువ ఒజుకుమ్‌ 13 పరుగులు చేశారు.

ఎక్స్‌ట్రాల రూపంలో లభించిన పరుగులు (15) నాగాలండ్‌ ఇన్నింగ్స్‌లో రెండో అత్యధిక స్కోర్‌ కావడం విశేషం. గ్రూప్‌-ఈలో ఇప్పటికే ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఐదు పరాజయాలు ఎదుర్కొన్న నాగాలాండ్‌ మరో ఓటమి దిశగా సాగుతుంది. 

>
మరిన్ని వార్తలు