Shane Warne: టీమిండియా కెప్టెన్‌ను ఆకాశానికెత్తిన ఆసీస్‌ స్పిన్‌ దిగ్గజం

7 Sep, 2021 19:13 IST|Sakshi
ఫోటో క్రెడిట్‌: రిపబ్లిక్‌ వరల్డ్‌

లండన్‌: ఓవల్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత జట్టుపై ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్‌ వార్న్ కూడా చేరాడు. తొలుత ట్విటర్ వేదికగా టీమిండియాపై ప్రశంసలు కురిపించిన వార్న్.. ఆతర్వాత మీడియాతో మాట్లాడుతూ.. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని ఆకాశానికెత్తాడు.  

'మరో అద్భుతమైన విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు. గత ఏడాది కాలంగా మీరు జట్టుగా సాధించిన విజయాలు న భూతో న భవిష్యత్‌. ప్రపంచంలోనే టీమిండియా అత్యుత్తమ టెస్టు జట్టు. ఇందుకు మీరు మాత్రమే నిజమైన అర్హులు. లాంగ్‌ లివ్‌ టెస్ట్‌ క్రికెట్‌' అంటూ వార్న్‌ ట్వీట్‌ చేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఓవల్‌ టెస్ట్‌లో కోహ్లి భారత జట్టును ముందుండి నడిపించిన తీరు అత్యద్భుతమని కొనియాడాడు. కోహ్లి.. టెస్ట్‌ క్రికెట్‌కు ఇస్తున్న ప్రాధాన్యత వల్ల సాంప్రదాయ ఫార్మాట్‌ స్థాయి పెరిగిందని, అతని సారధ్యంలో టీమిండియా ప్రపంచ క్రికెట్‌లో పవర్‌ హౌస్‌గా మారిందని ప్రశంసించాడు. టెస్ట్‌ క్రికెట్‌ పట్ల టీమిండియా కెప్టెన్‌కున్న ప్యాషన్‌ అతన్ని భూగ్రహంలోనే అత్యుత్తమ ఆటగాడిగా మార్చిందని ఆకాశానికెత్తాడు.

ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో 368 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఉమేశ్‌ యాదవ్‌ (3/60), శార్దూల్‌ ఠాకూర్‌ (2/22), బుమ్రా (2/27), జడేజా (2/50) ధాటికి 210 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా 157 పరుగుల తేడాతో ఓటమిపాలై 5 టెస్ట్‌ల సిరీస్‌లో 1-2తో వెనుకపడింది. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్‌ కాగా, 290 వద్ద ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. ఫలితంగా ఇంగ్లండ్‌కు 99 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్‌ శర్మ సూపర్‌ శతకం(127)తో రాణించడంతో టీమిండియా 466 పరుగులకు ఆలౌటైంది. కీలక తరుణంలో శతక్కొట్టిన హిట్‌ మ్యాన్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది.
చదవండి: అశ్విన్‌ విషయంలో టీమిండియా కెప్టెన్‌ నిర్ణయం సరైందే: ఏబీ డివిలియర్స్‌

మరిన్ని వార్తలు