Wasim Jaffer: 'ఏడాది వ్యవధిలో ఎంత మార్పు'.. కొత్త కెప్టెన్‌, కోచ్‌ అడుగుపెట్టిన వేళ

15 Jun, 2022 13:36 IST|Sakshi

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ ఆరంభానికి ముందు ఇంగ్లండ్‌ను సమస్యలు చుట్టుముట్టాయి. ఒకప్పుడు విజయవంతమైన కెప్టెన్‌గా వెలిగిన జో రూట్‌.. గతేడాది మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్‌లో వంక పెట్టలేకున్నా.. కెప్టెన్సీలో మాత్రం చేదు అనుభవమే ఎదురైంది. రూట్‌ కెప్టెన్సీలో గత 13 టెస్టుల్లో ఇంగ్లండ్‌ ఒకే ఒక్క విజయం నమోదు చేసింది. అది కూడా గతేడాది భారత్‌తో లీడ్స్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌. ఆ తర్వాత జరిగిన 12 టెస్టుల్లో ఆరింటిలో ఓడిపోయిన ఇంగ్లండ్‌ మరో ఆరింటిని డ్రా చేసుకుంది.

ఇంగ్లండ్‌ వరుసగా ఓడిన టెస్టు సిరీస్‌ల్లో ప్రతిష్టా‍త్మకమైన యాషెస్‌ సిరీస్‌తో పాటు వెస్టిండీస్‌ సిరీస్‌లు ఉన్నాయి. దీంతో జట్టును మొత్తం ప్రక్షాళన చేయాల్సిందేనని అభిమానులు విమర్శలు కురిపించారు. వరుస సిరీస్‌ ఓటములకు బాధ్యత వహిస్తూ రూట్‌ కెప్టెన్సీ పదవి నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ కొత్త కెప్టెన్‌గా రావడం.. కొత్త కోచ్‌గా బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ అడుగుపెట్టడంతో ఇంగ్లండ్‌ దశ పూర్తిగా మారిపోయింది.

కొత్త కెప్టెన్‌.. కొత్త కోచ్‌ వచ్చాకా ఇంగ్లండ్‌ టెస్టుల్లో వరుసగా రెండు విజయాలు నమోదు చేసింది. అది ఏకపక్ష విజయాలు కావడం విశేషం. ఆరు నెలల క్రితం వరుస ఓటములతో కుంగిపోయిన ఇంగ్లండ్‌ జట్టు తాజాగా మాత్రం బలంగా తయారైంది. దానికి కొత్త కోచ్‌, కొత్త కెప్టెన్‌ అడుగుపెట్టిన వేళా విశేషమే అని పలువురు మాజీ క్రికెటర్లతోపాటు అభిమానులు కామెంట్స్‌ చేశారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ ఇంగ్లండ్‌ ఆటతీరుపై చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో ​వైరల్‌గా మారింది. 

‘సరిగ్గా ఏడాది క్రితం జూన్ 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో 75 ఓవర్లలో 273 పరుగుల టార్గెట్‌ని ఛేదించినలేక 70 ఓవర్లలో 170 పరుగులు మాత్రమే చేసి మ్యాచ్‌ని డ్రా చేసుకుంది ఇంగ్లాండ్. సరిగ్గా ఏడాది తర్వాత జూన్ 2022లో అదే న్యూజిలాండ్ 72 ఓవర్లలో 299 పరుగుల టార్గెట్ నిర్దేశిస్తే, దాన్ని 50 ఓవర్లలోనే ఛేదించేసింది... ఏడాదిలోనే మైండ్‌సెట్‌ ఎంతలా మారింది.. కొత్త కోచ్‌, కెప్టెన్‌ అడుగుపెట్టిన వేళా విశేషమే’ అంటూ తెలిపాడు. 

ఇక నాటింగ్‌హామ్‌లో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ ఐదు వికెట్లతో సంచలన విజయం సాధించింది. 299 పరుగుల విజయలక్ష్యాన్ని ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. చివరి సెషన్‌లో ఇంగ్లండ్‌ విజయానికి 160 పరుగులు చేయాల్సిన దశలో మ్యాచ్‌ ‘డ్రా’ కావడం ఖాయమనిపించింది. కానీ బెయిర్‌స్టో (92 బంతుల్లో 136; 14 ఫోర్లు, 7 సిక్స్‌లు), స్టోక్స్‌  (75 నాటౌట్‌; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) విధ్వంసక బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ విజయతీరాలకు చేరింది. 

చదవండి: 16 ఓవర్లలో 160 పరుగులు.. విధ్వంసానికి పరాకాష్ట.. టెస్టు క్రికెట్‌లో నయా రికార్డు 

'సంజూ శాంసన్‌లో అదే పెద్ద మైనస్‌.. అందుకే'.. క్రికెట్‌ దిగ్గజం సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు