WI vs IND 1st ODI: వెస్టిండీస్‌తో భారత్ తొలి పోరు.. ధావన్‌కు జోడీ ఎవరు? 

22 Jul, 2022 07:16 IST|Sakshi

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: సాంప్రదాయ టెస్టు క్రికెట్, ధనాధన్‌ టి20 క్రికెట్‌ మధ్య వన్డేల అస్తిత్వం కష్టంగా మారుతున్న తరుణమిది. పైగా ప్రపంచ కప్‌ లేని ఏడాదిలో 50 ఓవర్ల పోరుకు సహజంగానే ప్రాధాన్యత తక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో భారత్, వెస్టిండీస్‌ మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు రంగం సిద్ధమైంది. క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌లో నేడు జరిగే తొలి సమరంలో ఇరు జట్లు తలపడనున్నాయి.

అయితే భారత యువ ఆటగాళ్ల కోణంలో ఈ సిరీస్‌ను కీలకంగా చెప్పవచ్చు. పలువురు సీనియర్ల గైర్హాజరులో తమ సత్తా చాటేందుకు వారికి ఇది సరైన వేదిక. మరో వైపు వెస్టిండీస్‌ కూడా వన్డేల్లో కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి అందుకునే ప్రయత్నంలో ఉంది. ఆ జట్టూ సొంతగడ్డపై ఇది సరైన అవకాశం. భారత టాప్‌ ప్లేయర్‌ రోహిత్, కోహ్లి, బుమ్రా, పంత్, షమీ, హార్దిక్‌ ఈ సిరీస్‌లో ఆడకుండా విశ్రాంతి తీసుకున్నారు. 2022లో భారత్‌కు శిఖర్‌ ధావన్‌ 7వ కెప్టెన్‌ కావడం విశేషం.  

ధావన్‌కు జోడీ ఎవరు? 
ఒకప్పుడు అద్భుత ఓపెనర్‌గా ఘనమైన రికార్డులు సాధించిన శిఖర్‌ ధావన్‌ కొంత కాలంగా తడబడుతున్నాడు. అతను ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఇబ్బంది పడటం కనిపించింది. అయితే అదృష్టవశాత్తూ కెప్టెన్సీ అవకాశం దక్కిన అతను ఈ సిరీస్‌లోనైనా రాణించాల్సి ఉంది. అతనికి ఓపెనర్‌ జోడీగా ఆడేందుకు తీవ్ర పోటీ నెలకొంది. దూకుడుగా ఆడగల ఇషాన్‌ కిషన్‌ ఉండగా...నిలకడగా ఆడగల రుతురాజ్, శుబ్‌మన్‌ గిల్‌ కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. కుడి, ఎడమ చేతివాటం ఓపెనింగ్‌ కావాలని కోరుకుంటే రుతురాజ్‌కు ప్రాధాన్యత లభించవచ్చు. టి20ల్లో ప్రదర్శించిన జోరుతో హుడా, సామ్సన్‌లు కూడా మిడిలార్డర్‌లో చోటు ఆశిస్తున్నారు.

అయితే అందరికంటే ఎక్కువగా శ్రేయస్‌ అయ్యర్‌కు ఈ సిరీస్‌ కీలకం కానుంది. వరుసగా విఫలమవుతున్నా అతని ఆటపై నమ్మకంతో మేనేజ్‌మెంట్‌ మళ్లీ మళ్లీ అవకాశాలు ఇస్తోంది. పైగా వన్డేలకు అతని బ్యాటింగ్‌ శైలి సరిగ్గా సరిపోతుంది. ఇలాంటి స్థితిలో అతను తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది.  లేదంటే జట్టులో చోటు కోల్పోవచ్చు కూడా. సూర్యకుమార్‌ కూడా తన ధాటిని కొనసాగించగలడు. ఆల్‌రౌండర్లుగా జడేజా, శార్దుల్‌ ముద్ర ముఖ్యం. బుమ్రా లేకపోవడంతో ప్రధాన పేసర్లు సిరాజ్, ప్రసిధ్‌కు చోటు ఖాయం. చహల్‌ను విండీస్‌ ఏమాత్రం ఎదుర్కోగలదో చూడాలి.  

పూర్తి ఓవర్లు ఆడేనా... 
టి20 ఫార్మాట్‌కు బాగా అలవాటు పడిన వెస్టిండీస్‌ జట్టు వన్డే ఇన్నింగ్స్‌లను నడిపించడం దాదాపుగా మరచిపోయింది. టీమ్‌ లో ఎంత మంది హిట్టర్లు ఉన్నా వారంతా టి20 తరహాలోనే ఆడుతుండటంతో క్రీజ్‌లో నిలవడం అసాధ్యంగా మారింది. 2019 వన్డే వరల్డ్‌ కప్‌నుంచి విండీస్‌ 39 ఇన్నింగ్స్‌లు ఆడితే 6 సార్లు మాత్రమే పూర్తి కోటా 50 ఓవర్లు ఆడగలిగింది. జట్టు బ్యాటింగ్‌ ప్రధానంగా పూరన్, పావెల్, మేయర్స్‌లపై ఆధారపడి ఉంది. పేసర్‌ అల్జారీ జోసెఫ్‌ తన పదును చూపించగలడు. తన ప్రతిభను ప్రదర్శించేందుకు జేడెన్‌ సీల్స్‌కు ఇది మంచి అవకాశం కాగా స్పిన్నర్‌ అకీల్‌ హొసీన్‌ ఇటీవల ఫామ్‌లో ఉన్నాడు. అన్నింటికి మించి ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ టీమ్‌లోకి పునరాగమనం చేయడంతో జట్టు బలం పెరిగింది. 

పిచ్, వాతావరణం 
వన్డేలకు తగిన వేదిక. బ్యాటింగ్, బౌలింగ్‌కు సమంగా అనుకూలిస్తుంది. గురువారం కొంత వర్షం కురిసి భారత జట్టు ప్రాక్టీస్‌ ఇండోర్‌కే పరిమితమైనా...మ్యాచ్‌ రోజు మాత్రం వర్ష సూచన లేదు.  

జట్ల వివరాలు (అంచనా) 
భారత్‌: ధావన్‌ (కెప్టెన్‌), రుతురాజ్‌/ ఇషాన్‌ కిషన్, శ్రేయస్, హుడా, సామ్సన్, సూర్యకుమార్, జడేజా, శార్దుల్, ప్రసిధ్, చహల్, సిరాజ్‌. 
వెస్టిండీస్‌: పూరన్‌ (కెప్టెన్‌), కింగ్, బ్రూక్స్, మేయర్స్, హోప్, రావ్‌మన్‌ పావెల్, హోల్డర్,
అకీల్‌ హొసీన్‌ , జోసెఫ్, మోతీ, సీల్స్,
చదవండి: హైదరాబాద్‌లో భారత్‌–ఆస్ట్రేలియా టి20

మరిన్ని వార్తలు