వారెవ్వా వెర్‌స్టాపెన్‌

4 Sep, 2023 01:11 IST|Sakshi

ఫార్ములావన్‌లో వరుసగా 10 విజయాలతో ప్రపంచ రికార్డు

మోంజా (ఇటలీ): అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఫార్ములావన్‌ (ఎఫ్‌1) చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధికంగా 10 వరుస విజయాలు సాధించిన డ్రైవర్‌గా వెర్‌స్టాపెన్‌ గుర్తింపు పొందాడు. ఆదివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రిలో రెండో స్థానం నుంచి రేసును ఆరంభించిన వెర్‌స్టాపెన్‌ నిర్ణీత 51 ల్యాప్‌లను అందరికంటే వేగంగా ఒక గంట 13 నిమిషాల 41.143 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానం దక్కించుకున్నాడు.

పెరెజ్‌ రెండో స్థానంలో, సెయింజ్‌ మూడో స్థానంలో నిలిచారు. ఫెరారీ డ్రైవర్‌ కార్లోస్‌ సెయింజ్‌ ‘పోల్‌ పొజిషన్‌’తో రేసును మొదలుపెట్టగా... 15వ ల్యాప్‌లో సెయింజ్‌ను వెర్‌స్టాపెన్‌ ఓవర్‌టేక్‌ చేసి ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత వెర్‌స్టాపెన్‌ను ఎవరూ అందుకోలేకపోయారు. దాంతో వెర్‌స్టాపెన్‌ ఖాతాలో ఈ సీజన్‌లో ఓవరాల్‌గా 12వ విజయం... వరుసగా 10వ విజయంతో కొత్త చరిత్ర నమోదైంది. 2013లో సెబాస్టియన్‌ వెటెల్‌ వరుసగా 9 రేసుల్లో గెలిచాడు.

వెటెల్‌ రికార్డును 25 ఏళ్ల వెర్‌స్టాపెన్‌ బద్దలు కొట్టాడు. అంతేకాకుండా ఈ సీజన్‌లో జరిగిన 14 రేసుల్లోనూ రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్లే గెలుపొందడం విశేషం. వెర్‌స్టాపెన్‌ 12 రేసుల్లో నెగ్గగా... రెడ్‌బుల్‌ జట్టుకే చెందిన మరో డ్రైవర్‌ సెర్జియో పెరెజ్‌ రెండు రేసుల్లో గెలిచాడు. 22 రేసుల ఈ సీజన్‌లో ప్రస్తుతం వెర్‌స్టాపెన్‌ 364 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. తదుపరి రేసు సింగపూర్‌ గ్రాండ్‌ప్రి ఈనెల 17న జరుగుతుంది.   

మరిన్ని వార్తలు