Delhi Capitals: ఢిల్లీ సారథిగా ఐదుసార్లు ఐసీసీ ట్రోఫీ గెలిచిన ఆసీస్‌ కెప్టెన్‌

2 Mar, 2023 15:50 IST|Sakshi
ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా మెగ్‌ లానింగ్‌ (PC: DC)

WPL 2023- Delhi Capitals Squad- Captain: ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ మహిళా జట్టు కెప్టెన్‌ పేరును ప్రకటించింది. ఆస్ట్రేలియాకు ఐదుసార్లు ప్రపంచకప్‌ అందించిన మెగ్‌ లానింగ్‌ను సారథిగా నియమించినట్లు తెలిపింది. ఆమెకు డిప్యూటీగా టీమిండియా క్రికెటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ను ఎంపిక చేసినట్లు గురువారం వెల్లడించింది. 

కాగా మార్చి 4 నుంచి మహిళల ప్రీమియర్‌ లీగ్‌(డబ్ల్యూపీఎల్‌)-2023 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ఆర్సీబీ స్మృతి మంధాన, ముంబై ఇండియన్స్‌ హర్మన్‌ప్రీత్‌కౌర్‌, గుజరాత్‌ జెయింట్స్‌ బెత్‌ మూనీ, యూపీ వారియర్జ్‌ అలిసా హేలీలను సారథులుగా నియమించినట్లు ప్రకటించాయి.

ఆరోజే తొలి మ్యాచ్‌
ఎట్టకేలకు ఢిల్లీ సైతం తమ కెప్టెన్‌ పేరును తాజాగా రివీల్‌ చేసింది. కాగా ఆస్ట్రేలియాకు చెందిన 30 ఏళ్ల మెల్‌ లానింగ్‌ రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌. ఆసీస్‌కు ఐదుసార్లు ఐసీసీ ట్రోఫీ అందించిన ఘనత ఆమెది. 2014, 2018, 2020, 2023 టీ20 ప్రపంచకప్‌, 2022 వన్డే వరల్డ్‌కప్‌ గెలిచింది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ మార్చి 5న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌తో డబ్ల్యూపీఎల్‌ ప్రయాణం ఆరంభించనుంది. ముంబైలోని బ్రబౌర్న్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగనుంది.

ఇక ఢిల్లీ కెప్టెన్, వైస్‌ కెప్టెన్లుగా నియమితులు కావడం పట్ల మెగ్‌ లానింగ్‌, జెమీమా రోడ్రిగ్స్‌ హర్షం వ్యక్తం చేశారు. కాగా ఫిబ్రవరి 13న జరిగిన వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ను రూ.1.1కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే, రోడ్రిగ్స్‌కు మాత్రం భారీ మొత్తంలో 2.2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సొంతం చేసుకుంది.

ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు:
మెగ్‌ లానింగ్‌, జెమీమా రోడ్రిగ్స్‌, షఫాలీ వర్మ, రాధా యాదవ్‌, శిఖా పాండే, మరిజానే క్యాప్‌, టైటాస్‌ సాధు, అలిస్‌ కాప్సీ, తారా నోరిస్‌, లారా హ్యారిస్‌, జేసియా అక్తర్‌, మిన్ను మణి, తాన్యా భాటియా, పూనమ్‌ యాదవ్‌, జెస్‌ జొనాస్సెన్‌, స్నేహదీప్తి, అరుంధతి రెడ్డి, అపర్ణ మొండాల్‌.

చదవండి: IND Vs AUS: స్టన్నింగ్‌ క్యాచ్‌.. అడ్డంగా దొరికిపోయిన శ్రేయాస్‌
BGT 2023: పుజారా భయపడుతున్నాడు.. అయ్యర్‌ పిరికిపందలా ఉన్నాడు! ముందుందిలే..

మరిన్ని వార్తలు