WTC Final: ఐసీసీ ఈవెంట్లు ఇద్దరికి కలిసి రాలేదు

4 Jun, 2021 15:45 IST|Sakshi

లండన్‌: జూన్‌ 18 నుంచి 22 వరకు భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరగనున్న ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌పైనే ఇప్పుడు అందరి కళ్లు నెలకొని ఉన్నాయి. తొలిసారి టెస్టు క్రికెట్‌ చరిత్రలో చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరగనుండడంతో ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఫైనల్లో తలపడుతున్న కివీస్‌, టీమిండియాలలో ఎవరు ఫేవరెట్‌ అనే దానిపై ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. వాస్తవానికి ఈ  రెండు బలంగా కనిపిస్తున్నా.. క్రిటిక్స్‌, మాజీ ఆటగాళ్ల దృష్టిలో ఎవరు ఒకరు మాత్రమే ఫేవరెట్‌గా ఉంటారు. అందులో చాలా మంది టీమిండియానే ఫేవరెట్‌ అని భావిస్తుంటే.. ఆసీస్‌ మాజీ స్పీడస్టర్‌ బ్రెట్‌ లీ మాత్రం కివీస్‌కు ఎక్కువ అడ్వాంటేజ్‌ ఉందని అభిప్రాయపడ్డాడు.


ఐసీసీకి ఇచ్చిన ఇంటర్య్వూలో బ్రెట్‌ లీ ఈ వ్యాఖ్యలు చేశాడు.'' ఇంగ్లండ్‌ పిచ్‌లు కివీస్‌కు సరిపోతాయి. ఎందుకంటే ఇక్కడి పిచ్‌పై వారు బ్యాటింగ్‌ చేస్తుంటే అది వారి సొంత గ్రౌండ్‌లో ఆడినట్టుగా ఉంటుంది. ఈ ఫైనల్లో బౌలింగ్‌ కీలకంగా మారనుంది. వికెట్‌ గురించి మాట్లాడేటప్పుడు బౌలింగ్‌కు సహకరిస్తుందా లేదా అనేది కీలకం. స్పిన్‌.. స్వింగ్‌ నుంచి ఫాస్ట్‌ బౌలింగ్‌ ఇలా ఏ అంశం చూసుకున్నా కివీస్‌కు అడ్వాంటేజ్‌ కనిపిస్తుంది. అయితే ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఇక బౌలింగ్‌ విభాగానికి వస్తే ఇరు జట్లు నాణ్యమైన బౌలర్లను కలిగి ఉన్నాయి. ఇండియన్‌ టెస్టు లైనప్‌ తీసుకుంటే కివీస్‌తో సమానంగా ఉంది. కానీ మ్యాచ్‌లో ఎవరు మెరుస్తారన్నది ఇప్పుడే చెప్పలేం. వాస్తవానికి ఇది కఠినమైన ప్రశ్న. ఇక బ్యాటింగ్‌ విభాగంలో ఇరు జట్లు సమానంగా ఉన్నా.. స్వింగ్‌ బౌలింగ్‌ను ఎదుర్కొని ఏ జట్టు బ్యాట్స్‌మన్‌ నిలబడతారో చూడాలి.. అయినా ఈ మ్యాచ్‌లో బౌలర్లదే కీలకపాత్ర.


ఇక ఇరు జట్ల కెప్టెన్ల విషయానికి వస్తే ముందుగా న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఒక మాస్టర్‌ బ్రెయిన్‌తో పాటు బోరింగ్‌ లేని కెప్టెన్‌. బోరింగ్‌ లేని కెప్టెన్‌ ఎందుకంటే అతను అవసరమున్నప్పుడు మాత్రమే తన బ్రెయిన్‌కు పదును పెట్టి ఆలోచిస్తాడు..ఓపిక అతనికి ఉన్న మంచి లక్షణం.. ఫలితం అతనికి అనుకూలంగా మారుతుంది. ఇక విరాట్‌ కోహ్లి అగ్రెసివ్‌ కెప్టెన్‌.. తాను తీసుకునే నిర్ణయాలను బలంగా నమ్ముతాడు. అయినా ఎవరి స్ట్రాటజీలు వారికి ఉంటాయి.

వీరిద్దరిలో కామన్‌ పాయింట్‌ ఏంటంటే.. ఇద్దరికి ఐసీసీ మేజర్‌ ఈవెంట్స్‌ ఇప్పటివరకు కలిసిరాలేదు. ఇద్దరు నాయకత్వం వహించిన జట్లు ఐసీసీ ప్రధాన టోర్నీలో చతికిలపడ్డాయి. అయితే తొలిసారి జరుగుతున్న టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఐసీసీ ఎవరో ఒకరిని విజేతగా చూడాలనే పట్టుదలతో ఉంది.. చూద్దాం విజయం ఎవరిని వరిస్తుందో'' అంటూ ముగించాడు. ఇక న్యూజిలాండ్‌ ఇప్పటికే ఇంగ్లండ్‌తో సిరీస్‌ ఆడుతుండగా.. టీమిండియా జట్టు గురువారం లండన్‌లో అడుగుపెట్టింది.
చదవండి: WTC: ‘రసవత్తరంగా ఉండాలంటే ప్రత్యేక విండో ఉండాలి’

మరిన్ని వార్తలు