SL Vs PAK 1st Test: యాసిర్‌ షా 'బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ'... దిగ్గజ బౌలర్‌ గుర్తురాక మానడు

19 Jul, 2022 15:25 IST|Sakshi

టెస్టు క్రికెట్‌లో 'బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ' అనగానే ముందుగా గుర్తుకువచ్చేది ఆస్ట్రేలియన్‌ దివంగత స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌. జూన్‌ 4, 1993న వార్న్‌.. ఇంగ్లండ్‌ బ్యాటర్‌ మైక్‌ గాటింగ్‌ను ఔట్‌ చేసిన విధానం ఎవరు మరిచిపోలేరు. పూర్తిగా లెగ్‌స్టంప్‌ దిశగా వెళ్లిన బంతి అనూహ్యమైన టర్న్‌ తీసుకొని ఆఫ్‌స్టంప్‌ వికెట్‌ను ఎగురగొట్టి.. క్రీజులో ఉన్న మైక్‌ గాటింగ్‌ సహా.. ఆసీస్‌ తోటి ఆటగాళ్లు, అభిమానులు సహా యావత్‌ క్రీడా ప్రపంచం ఆశ్చర్యానికి గురయ్యేలా చేశాడు. క్రికెట్‌ బతికున్నంతవరకు షేన్‌ వార్న్‌ ''బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ'' చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది. ఆ తర్వాత ఎంతో మంది బౌలర్లు వార్న్‌ లాగే ఆ ఫీట్‌ అందుకున్నప్పటికీ వార్న్‌ వేసిన బంతికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.

తాజాగా పాకిస్తాన్‌ స్టార్‌ యాసిర్‌ షా కూడా అచ్చం వార్న్‌ తరహాలోనే వేసిన బంతిని క్రికెట్‌ అభిమానులు సహా కామెంటేటర్స్‌ ''బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ''గా అభివర్ణిస్తు‍న్నారు. అయితే యాసిర్‌ వేసిన బంతిని దిగ్గజ బౌలర్‌తో పోల్చడం ఏంటని కొందరు అభిమానులు కొట్టిపారేసినప్పటికి.. అచ్చం వార్న్‌ బౌలింగ్‌ యాక్షన్‌ను పోలి ఉండే.. యాసిర్‌ షా వేసిన బంతి కూడా అదే తరహాలో చరిత్రలో నిలిచిపోనుంది. పాకిస్తాన్‌, శ్రీలంక మధ్య తొలి టెస్టు మ్యాచ్‌లో ఈ అద్భుత దృశ్యం చోటుచేసుకుంది.

యాసిర్‌ షా డెలివరీకి అప్పటికే కీలక ఇన్నింగ్స్‌ ఆడుతున్న కుషాల్‌ మెండిస్‌ వద్ద సమాధానం లేకుండా పోయింది. కుషాల్‌ 74 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇన్నింగ్స్‌ 56వ ఓవర్లో యాసిర్‌ షా బౌలింగ్‌కు వచ్చాడు. క్రీజులో ఉన్న కుషాల్‌కు పూర్తిగా లెగ్‌స్టంప్‌ అవతల వేసిన బంతి అనూహ్యమైన టర్న్‌ తీసుకొని ఆఫ్‌ స్టంప్‌ను ఎగురగొట్టింది. తాను వేసిన బంతి అంతలా టర్న్‌ అవుతుందని యాషిర్‌ షా కూడా ఊహించి ఉండడు. అందుకే వికెట్‌ పడగానే గట్టిగా అరుస్తూ సెలబ్రేట్‌ చేసుకున్నాడు. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే తొలి టెస్టులో లంక పాక్‌ ముందు 342 పరుగుల టార్గెట్‌ ఉంచింది. ప్రస్తుతం పాకిస్తాన్‌ రెండు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్‌ 3, బాబర్‌ ఆజం 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. పాక్‌ విజయానికి 185 పరుగులు దూరంలో ఉండగా.. మరొక రోజు ఆట మిగిలిఉన్న నేపథ్యంలో శ్రీలంక మిగిలిన 8 వికెట్లు తీయగలిగితే విజయం సాధిస్తుంది.

చదవండి: సరిగ్గా ఇదే రోజు.. ప్రపంచం ఆ అద్భుతాన్ని చూసింది.. ఐసీసీ ట్వీట్‌

Hasan Ali: అంతుపట్టని డ్యాన్స్‌తో అదరగొట్టిన పాక్‌ బౌలర్‌

మరిన్ని వార్తలు