WTC Points Table 2023-25: టాప్‌-2లో పాక్‌, బంగ్లాదేశ్‌! టీమిండియా ఏ ప్లేస్‌లో అంటే?

2 Dec, 2023 12:19 IST|Sakshi
బంగ్లాదేశ్‌ టెస్టు జట్టు - టీమిండియా(PC: ICC)

ICC World Test Championship 2023 - 2025: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్‌ టాప్‌-2లోకి దూసుకువచ్చింది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో 150 పరుగుల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్‌ టీమిండియాను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని ఆక్రమించింది.

కాగా బంగ్లాదేశ్‌ స్వదేశంలో న్యూజిలాండ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడుతోంది. ఇందులో భాగంగా శనివారం ముగిసిన మొదటి మ్యాచ్‌లో కివీస్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌.. న్యూజిలాండ్‌పై విజయం సాధించడం ఇదే మొదటిసారి.

చారిత్మక విజయంతో బంగ్లాదేశ్‌
ఇక బంగ్లాదేశ్‌ టెస్టు జట్టు కెప్టెన్‌గా నజ్ముల్‌ షాంటో తొలి ప్రయత్నంలోనే చారిత్రాత్మక విజయం అందించి ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా ప్రస్తుతం ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) 2023- 25 సీజన్‌ నడుస్తోంది.

అగ్రస్థానం ఇంకా పాకిస్తాన్‌దే
తాజా సైకిల్‌లో భాగంగా పాకిస్తాన్‌ ఆడిన రెండు మ్యాచ్‌లలో రెండూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. జూలైలో శ్రీలంక పర్యటనలో భాగంగా రెండు టెస్టుల్లో ఆతిథ్య జట్టును ఓడించి 24 పాయింట్లతో టాప్‌లో ఉంది.

మరోవైపు.. జూలైలో వెస్టిండీస్‌లో పర్యటించిన టీమిండియా రెండింట ఒక మ్యాచ్‌ గెలిచి.. మరొకటి డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో 16 పాయింట్లతో రెండో స్థానం(66.67 శాతం)లో ఉండేది. అయితే, తాజాగా న్యూజిలాండ్‌పై గెలుపుతో విజయశాతం(100 శాతం) విషయంలో మెరుగ్గా ఉన్న బంగ్లా ఇప్పుడు టీమిండియాను వెనక్కినెట్టింది. 


PC: ICC

మూడో స్థానానికి పడిపోయిన టీమిండియా
ఈక్రమంలో రోహిత్‌ సేన ప్రస్తుతం మూడో స్థానానికి పడిపోయింది. ఇక ఈ జాబితాలో ఆస్ట్రేలియా 18 పాయింట్లు(విజయశాతం 30)తో నాలుగు, వెస్టిండీస్‌ 4 పాయింట్లు(16.67 శాతం)తో ఐదో స్థానంలో ఉన్నాయి. ఇక ఇంగ్లండ్‌ కేవలం 9 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో ఉండగా.. శ్రీలంక, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా తదితర జట్టు ఇంకా తాజా సైకిల్‌లో పాయింట్ల ఖాతా తెరవనే లేదు. 

రెండుసార్లు చేదు అనుభవమే
కాగా డబ్ల్యూటీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్‌ గెలిస్తే 12, డ్రా చేసుకుంటే 4 పాయింట్లు వస్తాయి. ఇక సీజన్‌ ముగిసే నాటికి పాయింట్ల పట్టికలో టాప్‌-2లో ఉన్న జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఈ ట్రోఫీని తొలుత న్యూజిలాండ్‌, తర్వాత ఆస్ట్రేలియా గెలుచుకున్నాయి. ఈ రెండు పర్యాయాలు ఫైనల్‌ వరకు చేరిన టీమిండియాకు ఆఖరి పోరులో ఓటమి తప్పలేదు.

చదవండి: టీమిండియా హెడ్‌కోచ్‌ అయితేనేం! కుమారుల కోసం అలా..

మరిన్ని వార్తలు