నా వల్ల ఇబ్బందులు పడి ఉంటే క్షమించండి!.. టికెట్‌ నాకే ఇప్పించండి

28 May, 2023 00:06 IST|Sakshi

బద్ధ శత్రువులుగా ఉండి ఉదయగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఆ ముగ్గురు నేతలు ఇప్పుడు ఒక్కటైపోయారు. తమ రాజకీయ అవసరాల కోసం కలిసిపోయారు. వారే కంభం విజయరామిరెడ్డి, బొల్లినేని వెంకటరామారావు, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి. దశాబ్దాలపాటు ఆదరించిన పార్టీకి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి వెన్నుపోటు పొడిచి టీడీపీ నేతలతో చేతులు కలిపారు. నైతిక విలువలకు పాతరేసి ఆ ముగ్గురు నేతలూ ఏకం కావడంతో ప్రజల్లో పలచబడ్డారు.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరనేది నానుడి. కానీ ప్రస్తుత రాజకీయాల్లో నైతిక విలువలు లేకుండాపోయాయి. ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించిన, వహిస్తున్న కంభం విజయరామిరెడ్డి, బొల్లినేని వెంకటరామారావు, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించారు. కంభం, బొల్లినేని ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఆ ఇద్దరూ ఎప్పుడూ ఒకే వేదికను పంచుకున్న దాఖలాలే లేవు. ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించారు. ఒకరిపై ఒకరు పార్టీ పెద్దల వద్ద పంచాయితీలు పెట్టుకున్న సందర్భాలు కోకొల్లలు. అయితే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి కంభం, బొల్లినేనితో బద్ధ వైరం ఉండేది. వీరిలో ఎవరైనా మేకపాటిని విమర్శిస్తే.. నియోజకవర్గంలోని అన్ని మండలాల నేతలతో ప్రెస్‌మీట్లు పెట్టించి మరీ తిట్టించారు. మేకపాటి బహిరంగ వేదికలపై బొల్లినేనిపై అవినీతి ఆరోపణలు చేయడమే కాకుండా తన క్యాడర్‌తోనూ చేయించారు. ఇక కంభంపై అయితే మేకపాటి గతంలోనే విమర్శలు, ఆరోపణలు చేశారు.

వైఎస్సార్‌ కుటుంబంతో ఎదిగి..
జిల్లాలో మేకపాటి కుటుంబానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అత్యంత ప్రాధాన్యం కల్పించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సైతం వారికి అంతే ప్రాధాన్యం ఇచ్చారు. అయితే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి స్వార్థ రాజకీయాలు చేసి స్థాయిని దిగజార్చుకున్నారు. ఈ పరిణామాలు ముందుగానే గ్రహించిన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తన సోదరుడైనప్పటికీ చంద్రశేఖరరెడ్డిని దూరం పెట్టారు. నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలకు తెరతీసిన చంద్రశేఖర్‌రెడ్డి తన గ్రాఫ్‌ పడిపోవడంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తనకు టికెట్‌ రాదనే అనుమానంతో రాజకీయ భిక్ష పెట్టిన పార్టీకి, ఆదరించిన ప్రజలను విస్మరించి టీడీపీతో చేతులు కలిపారు.

పార్టీ క్యాడర్‌ దూరం
రాజకీయ అవసరాల కోసం ఒకరికొకరు దూషించుకున్న చంద్రశేఖర్‌రెడ్డి, కంభం విజయరామిరెడ్డి, బొల్లినేని వెంకటరామారావు ఇప్పుడు ఒక వేదికపైకి రావడంతో వీరితో అంటకాగిన పార్టీ క్యాడర్‌ దూరంగా వెళ్లిపోతున్నారు. రాజకీయ విమర్శలు, అవినీతి ఆరోపణలు, భౌతికదాడులు చేసిన చంద్రశేఖర్‌రెడ్డితో ఎలా కలిసి పనిచేయాలని లోలోనే టీడీపీ క్యాడర్‌తోపాటు అధికారపార్టీ శ్రేణులు రగిలిపోతున్నాయి. ఈ పరిణామాలతో ప్రజల్లోనూ ఆ ముగ్గురు నేతలు పలచబారారు.

టీడీపీలో బీసీ వాదన
వైఎస్సార్‌సీపీ బీసీలకు ప్రాధాన్యం ఇచ్చేలా గత ఎన్నికల్లో జిల్లాలో ఒక ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించింది. తర్వాత రాజ్యసభ టికెట్‌ బీసీలకు ఇచ్చింది. కానీ టీడీపీ మాత్రం బీసీలను ఉపయోగించుకోవడమే తప్ప వారికి పదవులు ఇవ్వడం లేదనే వాదన ఉంది. తాజాగా ఉదయగిరిలో బీసీ నేతగా ఉన్న చెంచలబాబు యాదవ్‌ టీడీపీ టికెట్‌ ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే టికెట్‌ తమకే ఇవ్వాలని ఆయన పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. వలస నేతల రాకతో టీడీపీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచిచూడాల్సిందే.

కంభంతో కలిసి 
నిన్నటి వరకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న కంభం విజయరామిరెడ్డిని చంద్రశేఖర్‌రెడ్డి కలిసి గతం..గతః అంటూ తనకు ఆశీస్సులు కావాలని కాళ్లబేరానికి వెళ్లాడని, తన వల్ల ఏవిధంగా అయినా ఇబ్బందులు పడి ఉంటే క్షమించమని ప్రాధేయపడ్డాడని తెలిసింది. ఈ పరిణామాలను చూసి టీడీపీ శ్రేణులు నివ్వెరపోయారని సమాచారం.

అవసరం కోసం దిగజారి
ఈ దఫా ఎన్నికల్లో పోటీపై ఆసక్తి చూపని బొల్లినేని గతంలోనే పార్టీ అధిష్టానానికి సంకేతం పంపారు. దీంతోపాటు పార్టీ అభ్యర్థిత్వం ఇప్పిస్తానంటూ ప్యాకేజీ మాట్లాడుకున్న ఇద్దరు నేతలను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వద్దకు తీసుకెళ్లిన ఘటనలు ఉన్నాయి. కాని ఆ నేతలను చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో చినబాబు లోకేశ్‌ కాకర్ల సురేష్‌ను రంగంలోకి దింపడంతో ఆయన టికెట్‌ నాదేనంటూ ప్రకటించుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీలో టికెట్ల లొల్లి జరుగుతున్న క్రమంలో టికెట్‌ తనకిస్తే పోటీ చేస్తానంటూ మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి రంగంలోకి దిగారు. నైతిక విలువలకు పాతరేసిన చంద్రశేఖర్‌రెడ్డి తనకు రాజకీయ శత్రువులుగా ఉన్న బొల్లినేని, కంభం ఇళ్లకు వెళ్లి వారి ఆశీస్సులు కోరారు.

మరిన్ని వార్తలు