యూరియాను అధిక మోతాదులో వాడొద్దు

25 Feb, 2023 10:08 IST|Sakshi
నాగన్నను అభినందిస్తున్న నాయకులు

ఆత్మకూర్‌(ఎస్‌): రైతులు వరి పొలాలకు అధిక మోతాధులో యూరియాను వాడొద్దని జిల్లా వ్యవసాయాధికారి రామారావు నాయక్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని నెమ్మికల్లు, ఆత్మకూర్‌, ఏపూరు గ్రామాల్లోని పీఏసీఎస్‌ కేంద్రాల్లో యూరియా అమ్మకాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ యూరియాను ఎక్కువ మోతాదులో వాడడం వల్ల వరికి చీడపీడలు సోకుతాయన్నారు. అంతేకాకుండా భూసారం దెబ్బతింటుందన్నారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. ఆయన వెంట ఏఓ దివ్య, పీఏసీఎస్‌ల సిబ్బంది ఉన్నారు.

ఆయిల్‌పామ్‌ సాగుపై దృష్టి సారించాలి
మద్దిరాల : రైతులు ఆయిల్‌పామ్‌ సాగుపై దృష్టి సారించాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీధర్‌ అన్నారు. శుక్రవారం మండల పరిదిలోని రైతు వేదికలో రైతులకు ఆయిల్‌పామ్‌ సాగుపై ఏర్పాటు చేసిన ఆవహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఓ వికాస్‌ పాటిల్‌, ఏఈఓ రాకేష్‌, సర్పంచ్‌ దామెర్ల వెంకన్న, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ బద్దం సంజీవరెడ్డి, పతంజలి కంపెనీ సూపర్‌వైజర్‌ భద్రాచలం, ఉప సర్పంచ్‌ వెంకన్న, రైతులు తదితరులు పాల్గొన్నారు.

పల్లె ప్రకృతి వనాల పరిశీలన
తిరుమలగిరి : మామిడాల గ్రామంలోని బృహత్‌ పల్లె ప్రకృతి వనాన్ని ఉద్యానవన శాఖ అధికారి శ్రీధర్‌ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రకృతి వనాల్లో చెట్లను సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమేష్‌ చారి, ఎంపీఓ మారయ్య తదితరులు పాల్గొన్నారు.

యువత జాబ్‌మేళాలను సద్వినియోగం చేసుకోవాలి
దురాజ్‌పల్లి (సూర్యాపేట): జిల్లాలోని నిరుద్యోగ యువత జాబ్‌ మేళాలను సద్వినియోగం చేసుకుంటూ ఉపాధి అవకాశాలు పొందాలని జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి మాధవరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో ఉపాధి కల్పన కార్యాలయంలో నిర్వహించిన జాబ్‌మేళాలో వివిధ ప్రైవేట్‌ కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులకు ఆర్డర్‌ కాపీలను అందించి మాట్లాడారు.

జిల్లా ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ జాబ్‌ మేళాకు నిరుద్యోగ యువత పెద్దసంఖ్యలో పాల్గొన్నారని, మూడు ప్రైవేట్‌ కంపెనీలలో 44 ఉద్యోగాల ఖాళీలకు ప్రకటన ఇవ్వగా 118 మంది హాజరయ్యారని తెలిపారు. వారిలో అర్హత కలిగిన 20 మందిని ఎంపిక చేసి వారికి నియామకపత్రాలను అందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా కంపెనీల మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

ఐఎన్‌టీయూసీ జాతీయ కార్యదర్శిగా నాగన్నగౌడ్‌
హుజూర్‌నగర్‌ : ఐఎన్‌టీయూసీ జాతీయ ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా హుజూర్‌నగర్‌కు చెందిన యరగాని నాగన్నగౌడ్‌ రెండోసారి ఎన్నికయ్యారు. న్యూఢిల్లీలో జరిగిన 33వ జాతీయ ప్లీనరీ సమావేశాల్లో నాగన్నను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు నాయకులు ఆయనను అభినందించారు. కాగా శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు.

ఐఎన్‌టీయూసీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కార్మికుల సంక్షేమం కోసం కృషిచేస్తానని చెప్పారు. నూతన జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై న సంజీవరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. తనను కార్యదర్శిగా రెండోసారి ఎన్నుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
 

మరిన్ని వార్తలు