Sakshi News home page

లెక్క తప్పిన ఎన్నికల ఖర్చు.. ప్రచారానికి పైసలెట్లా..!?

Published Tue, Nov 14 2023 1:52 AM

- - Sakshi

సాక్షి, యాదాద్రి : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బు కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల ఖర్చుకోసం ముందుగా వేసుకున్న అంచనాలు లెక్కతప్పాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మందగించడంతో లావాదేవీలు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో రూ.కోట్లు విలువ చేసే భూములు అమ్మకానికి పెట్టినా కొనుగోలు చేసేవారు కరువయ్యారు.

అమ్మిన స్థిరాస్తుల డబ్బులు సమయానికి చేతికందడం లేదు. వెరసి రోజువారీ ప్రచారానికి ఖర్చులు వెళ్లదీయం కూడా అభ్యర్థులకు కష్టంగా మారింది. అప్పుచేద్దామన్నా దొరికే పరిస్థితి లేకపోవడంతో ఎంత మిత్తి ఇవ్వడానికై నా సిద్ధపడుతున్నారు. అభ్యర్థుల నుంచి డబ్బులు అందకపోవడంతో కేడర్‌ బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. కొందరు జెండా పక్కన పడేసి ప్రచారంలో పాల్గొనడం లేదు.

రోజు ఖర్చులే తడిసిమోపెడు
అభ్యర్థులకు రోజువారీ ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నాయి. పోలింగ్‌ బూత్‌ల వారీగా ప్రచారం చేసే కార్యకర్తలకు ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం, చేతి ఖర్చులు సగటున ఒక్కో బూత్‌కు రోజూ రూ.15వేల వరకు ఖర్చు వస్తుంది. వివిధ పార్టీల నుంచి చేరికల సందర్భంగా భోజనాలు, రవాణా ఖర్చులు, కొందరికి ప్యాకేజీలకు రూ.లక్షల్లో ముట్టజెప్పవలసి ఉంటుంది.

అంతేకాకుండా ముఖ్య నాయకులకు వాహనాల కిరాయి, డీజిల్‌, పెట్రోల్‌ ఇతరత్రా ఖర్చులు ఏరోజుకారోజు చెల్లించాల్సిందే. దీంతో పాటు సభలకు, రోజువారి ప్రచారారానికి వచ్చే మహిళలు, యువత బైక్‌ ర్యాలీలకు, ప్రచార రథాలు, కళాకారులకు ఏరోజుకారోజు చెల్లించాలి. దీంతో పాటు ఫ్లెక్సీలు, జెండాలు, టోపీలు, ఎన్నికల ప్రచార సామగ్రి ఇలా పలు రకాలుగా లెక్కకురాని ఖర్చు రూ.లక్షల్లో ఉంటుంది.

కొన్ని ఉదాహరణలు
● యాదాద్రి జిల్లాలో ఓ జాతీయ పార్టీకి చెందిన అభ్యర్థి డబ్బులకోసం తిప్పలు పడుతున్నాడు. ఎన్నికల కమిషన్‌ నిఘా పెట్టడంతో డబ్బులు వెంటవెంటనే తేలేని పరిస్థితి నెలకొంది. దీంతో రోజువారీ ప్రచార ఖర్చులను వెళ్లదీడయం కూడా అతనికి కష్టంగా మారింది.

● యాదాద్రి జిల్లాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన అభ్యర్థి హైదరాబాద్‌లో తనకున్న ఓపెన్‌ ప్లాట్లను విక్రయించాడు. డబ్బులు ఇంకా చేతికంద లేదు. దీంతో స్థానిక కార్యకర్తలు, ప్రచారానికి వచ్చే వారికి చెల్లించేందుకు ఇబ్బందిగా మారింది. గత్యంతరం లేక ఆయన చెక్కులు ఇస్తున్నాడు. పోలింగ్‌ నాటికి డబ్బులు సమకూర్చుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు.

● సూర్యాపేట జిల్లాలో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి చేతిలో డబ్బు లేక నానా తిప్పలు పడుతున్నారు. రూ.5 వడ్డీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అప్పు దొరకడం లేదని సదరు వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రోజువారీ కార్యక్రమాలకు అందిన కాడికి అప్పులు తెచ్చి చెల్లిస్తున్నాడు.

● యాదాద్రి జిల్లాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాడు. టికెట్‌ కోసం తీవ్ర ప్రయత్నం చేశాడు. అయితే టికెట్‌ వస్తదో రాదోనని కొంత ఉదాసీనంగా ఉన్నాడు. అయితే టికెట్‌ రావడంతో డబ్బులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అమ్మడానికి రూ.కోట్ల విలువ చేసే భూమి ఉన్నా కొనుగోలు చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. దీంతో ప్రచార ఖర్చులు వెళ్లదీయడం కూడా కష్టతరంగా ఉందని అభ్యర్థి వాపోతున్నాడు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ఎన్నికల ఖర్చుకోసం భూమి విక్రయించారు. రిజిస్ట్రేషన్‌ కూడా చేశారు. రూ.కోట్లలో రావాల్సి ఉన్నా సకాలంలో చేతికందడం లేదు. కొనుగోలుదారుడు కాలయాపన చేస్తుండడంతో రోజువారీ ఎన్నికల ఖర్చుకు అభ్యర్థి ఇబ్బంది పడుతున్నాడు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరికొందరు అభ్యర్థులు ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు.

Advertisement
Advertisement